ప్రతి భారతీయుడు ఈ పిటిషన్ పై సంతకం చేయాలి : కేటీఆర్

ప్రతి భారతీయుడు ఈ పిటిషన్ పై సంతకం చేయాలి : కేటీఆర్

చేనేత ఉత్పత్తులపై 5 శాతం జీఎస్టీని రద్దు చేయాలని కోరుతూ నిన్న పోస్ట్ కార్డ్ ఉద్యమాన్ని ప్రారంభించిన మంత్రి కేటీఆర్.. తాజాగా ఇవాళ ఆన్ లైన్ పిటిషన్ పై సంతకాల సేకరణను  మొదలుపెట్టారు. ‘ఛేంజ్.ఓఆర్జీ’ అనే వెబ్ సైట్ వేదికగా చేనేత కార్మికుల సమస్యలను వివరిస్తూ, చేనేత పరిశ్రమ సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించాలని కోరుతూ ఒక ఆన్ లైన్ పిటిషన్ ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.

జీఎస్టీ భారం వల్ల చేనేత రంగం కుదేలయ్యే పరిస్థితి ఉందని, ఎంతోమంది ఉపాధి అవకాశాలను కోల్పోయే ముప్పు ఉందని ఆ పిటిషన్ లో కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆజాదీకా అమృత్ మహోత్సవ్ జరుపుకుంటున్న వేళ చేనేత ఉత్పత్తులపై జీఎస్టీని ఎత్తివేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.  చేనేత రంగ పరిరక్షణను కోరుకునే ఈ పిటిషన్ పై ప్రతి భారతీయుడు సంతకం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈమేరకు ఓ ట్వీట్ చేశారు. 

చేనేత కార్మికుల సమస్యలపై ప్రధాని మోడీకి ప్రతి ఒక్కరు పోస్ట్ కార్డులు రాయాలంటూ మంత్రి కేటీఆర్  ప్రారంభించిన ఉద్యమానికి ఎమ్మెల్సీ కవిత సంఘీభావం ప్రకటించారు. తాను కూడా చేనేత కార్మికుల సమస్యలను వివరిస్తూ ప్రధాని మోడీ పోస్ట్ కార్డ్ రాశానని ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.