కాంగ్రెస్​ ప్రభుత్వానికి సహకరిస్తాం: కేటీఆర్

కాంగ్రెస్​ ప్రభుత్వానికి సహకరిస్తాం: కేటీఆర్

హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్​ ప్రభుత్వానికి సహకరిస్తామని బీఆర్ఎస్​వర్కింగ్​ ప్రెసిడెంట్ ​కేటీఆర్​అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్​ పార్టీకి ఆయన అభినందనలు తెలిపారు. ఫలితాలు ప్రకటించిన అనంతరం తెలంగాణ భవన్​లో ఆయన మీడియాతో మాట్లాడారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజమని, ఇది చిన్న స్పీడ్​బ్రేకర్​ మాత్రమే అన్నారు. పార్టీ క్యాడర్ ​ధైర్యం కోల్పోవద్దన్నారు. పార్టీ గెలుపు కోసం కష్టపడ్డ కార్యకర్తలు, నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. తమకు ప్రజలు రెండుసార్లు అవకాశం ఇచ్చారని తెలిపారు. ‘‘ఎన్నికల్లో మేము ఆశించిన ఫలితం రాలేదు. తప్పులు ఎక్కడ జరిగాయో సమీక్షించుకుంటాం. ప్రతిపక్ష పాత్ర పోషించాలని ప్రజలు మమ్మల్ని ఆదేశించారరు.

23 ఏళ్ల ప్రస్థానంలో ఎన్నో ఎదురు దెబ్బలు చూశాం. ప్రజల తీర్పును గౌరవించి సీఎం పదవికి కేసీఆర్ రాజీనామా చేశారు. కాంగ్రెస్ ​వేవ్​ఉంటే రాష్ట్రమంతా ఒకేలా ఎన్నికల ఫలితాలు ఉండాలి. కానీ గ్రేటర్ ​హైదరాబాద్, మెదక్, కరీంనగర్ లో మంచి ఫలితాలు సాధించాం” అని కేటీఆర్ పేర్కొన్నారు. సింగరేణి ప్రైవేటీకరణను అడ్డుకున్నామని, కార్మికుల సంక్షేమానికి ఎంతో కృషి చేసినా ఆ బెల్ట్​లోనూ ఓడిపోయామన్నారు.