నేడు కమలాపూర్​కు కేటీఆర్

నేడు కమలాపూర్​కు కేటీఆర్

కమలాపూర్, వెలుగు : హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలకేంద్రంలో నేడు మంత్రి కేటీఆర్ పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు కరీంనగర్ నుంచి హెలీక్యాప్టర్ లో కమలాపూర్​కు రానున్నారు. కొత్తగా నిర్మిస్తున్న బస్టాండ్, కుల సంఘ భవనాలు, టెంపుల్​ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఇటీవల నిర్మించిన మహాత్మా జ్యోతిబా ఫూలే బాయ్స్, గ్లర్స్ హాస్టల్స్, కేజీబీవీ, ఇంటర్ కాలేజీ బిల్డింగులను ప్రారంభించనున్నారు. స్టూడెంట్లతో లంచ్ చేసి, రోడ్డు మార్గం ద్వారా కమలాపూర్ నుంచి జమ్మికుంటలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు.

కానరాని గెల్లు ఫొటోలు..

మంత్రి కేటీఆర్ టూర్ నేపథ్యంలో కమలాపూర్ గులాబీమయం అయింది. రోడ్లకు ఇరువైపులా మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి కటౌట్లు కనిపిస్తున్నాయి. ప్రధాన చౌరస్తాల్లో భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే.. ఎక్కడా గెల్లు శ్రీనివాస్ ఫొటోలు కనిపించడం లేదు. ఉద్యమకారుడైన గెల్లు గత హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ తరఫున బరిలో నిలబడి ఓడిపోయారు. అయినా, తను నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. ఈక్రమంలో వచ్చే ఎన్నికల్లో హుజురాబాద్ టికెట్ ఆశిస్తున్న కౌశిక్ రెడ్డి.. గెల్లు శ్రీనివాస్ ను పూర్తిగా దూరం పెట్టారు.ఈక్రమంలో ఇరువురి మధ్య వర్గ పోరు నడుస్తోంది. గెల్లుతో పాటు జడ్పీ చైర్మన్ సుధీర్ కుమార్  ఫొటో కనిపించకపోవడం ఆ పార్టీలో చర్చనీయాంశం అయింది.

ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి..

కమలాపూర్​లో మంత్రి కేటీఆర్ పర్యటనకు మరో మంత్రి గంగుల కమలాకర్ సోమవారం ఏర్పాట్లను పరిశీలించారు. జ్యోతిబా ఫూలే గ్లర్స్ హాస్టల్ ను తనిఖీ చేశారు. ఆఫీసర్లతో చర్చించారు. కేటీఆర్ పర్యటనలో ఎలాంటి లోటుపాట్లు జరగకుండా చూసుకోవాలన్నారు. పేదలకు ఉన్నత విద్య అందించాలన్న లక్ష్యంతో కేసీఆర్ ప్రభుత్వం శాశ్వత విద్యాలయాలు నిర్మిస్తోందన్నారు. రాష్ట్రమంత్రిగా సేవలు అందిస్తుండడం తన అదృష్టమన్నారు. బీఆర్ఎస్ విధానాలను దేశ వ్యాప్తం చేసేందుకు కేసీఆర్ ఉద్యమిస్తున్నారన్నారు. ఇదిలా ఉండగా.. కేటీఆర్ పర్యటనకు వరంగల్ సీపీ ఏవీ రంగనాథ్ పకడ్బందీ బందోబస్తు ఏర్పాటు చేశారు. హెలీప్యాడ్ స్థలాన్ని పరిశీలించి, పోలీసు ఆఫీసర్లతో రివ్యూ చేశారు. 300 మంది పోలీసులకు డ్యూటీలు వేశారు. ఇందులో ఆరుగురు డీఎస్పీలు, 15 మంది సీఐలు, 25మంది ఎస్సైలు ఉన్నారు. ఆయా కార్యక్రమాల్లో ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి, రాష్ర్ట ఎస్సీ సెల్ చైర్మన్ బండ శ్రీనివాస్, గెల్లు శ్రీనివాస్​, సింగిల్​విండో చైర్మన్ పేరాల సంపత్​ రావు, కేడీసీసీ డైరెక్టర్​ పోరండ్ల కృష్ణప్రసాద్ తదితరులున్నారు.

అయ్యా... ఆదుకోండి

కమలాపూర్ మండలకేంద్రానికి చెందిన ఏతిపతి పుష్ప పేదరికంతో ఇబ్బందిపడుతున్నారు. పుష్ప భర్త లక్ష్మీనరసయ్య మరణించగా.. ఒక్కగానొక్క కొడుకు పక్షవాతంతో బాధపడుతున్నాడు. కొడుకు భిక్షపతికి చిన్నతనంలో గుండెకు రంధ్రం పడగా.. పుట్టపర్తి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆపరేషన్ చేయించారు. ఆ తర్వాత మెదడుకు చీము రావడంతో బ్రెయిన్ ఆపరేషన్ చేయించారు. అది వికటించడంతో రెండు కండ్లు పోయాయి. గత 20 ఏండ్లుగా తల్లి తన కొడుకుకు సేవలు చేస్తూ.. జీవిస్తోంది. పెంకుటిల్లుతో ఇబ్బందిపడుతున్నామని, ఇల్లు కట్టించి ఇవ్వాలని మంత్రి కేటీఆర్ ను వేడుకుంటోంది.