మంత్రి మల్లా రెడ్డిని  బర్తరఫ్ చేయాలి ..  నేషనల్ ఉమెన్ కమిషన్​కు బీజేపీ మోర్చా ఫిర్యాదు

మంత్రి మల్లా రెడ్డిని  బర్తరఫ్ చేయాలి ..  నేషనల్ ఉమెన్ కమిషన్​కు బీజేపీ మోర్చా ఫిర్యాదు

న్యూఢిల్లీ, వెలుగు:  మల్లా రెడ్డిని వెంటనే మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని నేషనల్ ఉమెన్ కమిషన్(ఎన్ డబ్ల్యూసీ)ను బీజేపీ మోర్చా కోరింది. ఆయన ఆదేశాల వల్లే బీఆర్ఎస్ మహిళా నేతలు అంకుషాపూర్ బీజేపీ ఎంపీటీసీ శోభా దామోదర్ రెడ్డిపై దాడికి పాల్పడ్డారని ఆరోపించింది. సోమవారం ఢిల్లీలోని ఎన్ డబ్ల్యూసీ చైర్మన్ రేఖా శర్శను రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు గీతామూర్తి, శోభారెడ్డి ఇతర మహిళ నేతలు కలిసి మంత్రి మల్లా రెడ్డిపై ఫిర్యాదు చేశారు. అనంతరం గీతామూర్తి మాట్లాడుతూ..గత నెల 27న మేడ్చల్ జిల్లా కలెక్టరేట్ లో అంకుషాపూర్ ఎంపీటీసీ శోభా దామోదర్ రెడ్డిపై దాడి జరిగిందని గుర్తుచేశారు. మంత్రి మల్లా రెడ్డి ఉసిగొల్పడం వల్లే బీఆర్ఎస్ మహిళలు ఆమెపై దాడికి పాల్పడ్డారని తెలిపారు. 

బీఆర్ఎస్ వైఫల్యాలను ప్రశ్నించినందుకే శోభారెడ్డిని మీటింగ్ నుంచి బయటికి లాగి పడేయాలని మంత్రి మల్లారెడ్డి బీఆర్ఎస్ మహిళా నేతలను ఉసిగొల్పారని తెలిపారు.దాంతో  మేయర్ మేకల కావ్యా రెడ్డి, శామీర్ పేట్ జడ్పీటీసీ ఎల్లుబాయి, శామీర్ పేట్ ఎంపీపీ రజిత పలువురు మహిళలు శోభారెడ్డిని లాక్కెల్లి బయటకు నెట్టేసారని చెప్పారు. ఇంత జరుగుతున్న మేడ్చల్ జిల్లా కలెక్టర్ అమోమ్ కుమార్, డిప్యూటీ కలెక్టర్ అభిషేక్ అగస్త్య, ఇద్దరు డీసీపీలు చూస్తూ ఉండిపోయారని తెలిపారు. వారిని కూడా సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.  ఘటనపై విచారణకు ఆదేశిస్తామని ఎన్ డబ్ల్యూసీ చైర్మన్ రేఖా శర్మ హామీ ఇచ్చినట్లు గీతామూర్తి పేర్కొన్నారు.  

రైతు సమస్యలను లేవనెత్తడం తప్పా...

ఎంపీటీసీ శోభారెడ్డి మాట్లాడుతూ..సమావేశంలో రైతుల సమస్యలను లేవనెత్తడం తప్పు ఎలా అవుతుందని అన్నారు. సమస్యలపై నిలదీసినవాళ్లను మీటింగ్​ల నుంచి గెంటేస్తారా? అని ఫైర్ అయ్యారు. మంత్రి మల్లారెడ్డి, కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులు చూస్తుండగానే తనను బీఆర్ఎస్ మహిళా నేతలు ఈడ్చుకుంటూ తీసుకెళ్లారని ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య లైంగిక వేధింపులు తట్టుకోలేక షేజల్ ఆత్మహత్య ప్రయత్నం చేసిందని గుర్తు చేశారు. వచ్చే ఎన్నికల్లో ఓడించి బీఆర్ఎస్ కు బుద్ధి చెప్పాలని ప్రజలను కోరారు.