మంత్రి మల్లారెడ్డికి షాక్.. సొంత నియోజకవర్గంలో తీవ్ర వ్యతిరేకత

మంత్రి మల్లారెడ్డికి షాక్.. సొంత నియోజకవర్గంలో తీవ్ర వ్యతిరేకత

మంత్రి మల్లారెడ్డికి సొంత నియోజకవర్గంలో  ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. మేడ్చల్ నియోజకవర్గంలో పర్యటిస్తున్న మంత్రి మల్లారెడ్డిని ఆయా గ్రామాల ప్రజలు సమస్యలపై నిలదీస్తున్నారు. తాజాగా మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా తూంకుంటలో  గ్రంథాలయ భవన నిర్మాణ పనుల శంకుస్థాపనకు వచ్చిన మంత్రి మల్లారెడ్డిని అడ్డుకున్నారు.  

మేడ్చల్ జిల్లాలోని  దేవరయాంజల్లో గ్రామస్తులు కొన్ని సంవత్సరాల కిందట డబల్ బెడ్ రూమ్ అప్లై చేసుకుంటే.. ఇప్పటివరకు రాలేదని మంత్రి మల్లారెడ్డిని నిలదీశారు. అదీకాక గ్రామంలోని ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేసుకుంటే.. వాటిని కూల్చివేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చినవారు దేవదాయ శాఖ భూముల్లో అక్రమ నిర్మాణాలు, బిల్డింగులు కట్టుకుంటే మంత్రి మల్లారెడ్డి ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు.

ఎన్నికల ముందు గ్రామాల్లోకి వచ్చి హామీలు ఇచ్చి వెళ్లిపోవడం తప్ప.. మళ్లీ గ్రామాల వైపు మంత్రి మల్లారెడ్డి కన్నెత్తి కూడా చూడరని విమర్శించారు. కనీసం ఇకనుంచి అయినా డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇప్పించాలని  వేడుకున్నారు. అటు శామీర్ పేట గ్రామంలో కూడా అధికార పార్టీ లీడర్లను గ్రామస్తులు నిలదీశారు. అర్హులైన వారందరికీ డబులు బెడ్ రూమ్ ఇండ్లు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. గ్రామంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇచ్చిన  కొందరికి..స్థానిక పెద్దమ్మ కాలనీలో కూడా ప్లాట్స్ ఇస్తున్నారని వాపోయారు. తొమ్మిది సంవత్సరాలు అవుతున్నా తమ సమస్యలను మంత్రి మల్లారెడ్డి  పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.