మరో వివాదంలో మంత్రి మల్లారెడ్డి

మరో వివాదంలో మంత్రి మల్లారెడ్డి

మంత్రి మల్లారెడ్డి మరో వివాదంలో చిక్కుకున్నారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా తూంకుంట మున్సిపాలిటీలోని  శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ పరిసరాల్లో మల్లన్న గుడి నిర్మాణానికి మంత్రి మల్లారెడ్డి శంకుస్థాపన చేశారు. అయితే అక్కడ ఇదివరకే వెంకటేశ్వరస్వామి ఆలయం ఉంది. దీంతో ఈ ఆలయ ట్రస్టు కుటుంబ సభ్యులు మంత్రి మల్లారెడ్డికి వ్యతిరేకంగా నిరసనకు దిగారు. తూంకుంటలో ఇది వరకే వెంకటేశ్వర స్వామి ఆలయం ఉండగా..ఈ ఆలయ పరిధిలో అనేక దేవాలయాలు ఉన్నాయని..అయినా మరో ఆలయం ఎందుకు నిర్మిస్తున్నారంటూ మండిపడ్డారు. మంత్రి మల్లారెడ్డి శంకుస్థాపనకు సంబంధించిన కార్యక్రమాన్ని వీడియో తీస్తుండగా.. బీఆర్ఎస్ నాయకులు బలవంతంగా ఫోన్ లాక్కోవడంతో వివాదం మరింత తీవ్రమైంది. అలాగే బీజేపీ రాష్ట్ర యువమోర్చా అధికార ప్రతినిధి రవీందర్ గౌడ్ సైతం దేవాలయ భూములు కబ్జాకు గురవుతున్నా.. పాలకులు ఏం చేస్తున్నారంటూ ఆందోళన దిగారు. నిరసనలు, ఆందోళనల మధ్య మంత్రి మల్లారెడ్డి హడావిడిగా  కొబ్బరికాయ కొట్టి అక్కడి నుంచి వెళ్లిపోయారు.

ఏం జరిగిందంటే.. 

మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా తుంకుంట మున్సిపాలిటీ  పరిధిలోని సర్వే నెంబర్ 357 లో 15 ఎకరాల 39 గుంటల దేవాదాయ శాఖ భూమి ఉంది. అయితే అందులో దాదాపు వెయ్యి సంవత్సరాల పురాతనమైన వెంకటేశ్వర స్వామి వారి ప్రధాన దేవాలయం ఉంది. ఉపదేవాలయాలైన శివాలయం, ఆంజనేయ ఆలయాలు ఉండేవని.. దానిలో మల్లన్న గుడి ఎక్కడి నుండి వచ్చిందని ఆలయ ప్రధాన అర్చకులు తిరుమలేష్ ప్రశ్నించారు.  ఆలయ భూమిని కబ్జా చేసేందుకే ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా చెప్తున్నారని ఆరోపించారు.

భూముల విలువ పెరగడంతో కబ్జాదారుల కన్ను దేవాలయ భూముల మీదపడిందన్నారు. ఈ భూమిని ఎలాగైనా కబ్జా చేయాలని మల్లన్న గుడిని నిర్మించేందుకు ప్లాన్ చేశారని ఆరోపించారు.  అందులో భాగంగానే 10 ఎకరాల భూమిలో మల్లన్న గుడి నిర్మించేందుకు మంత్రి మల్లారెడ్డి చేతుల మీదుగా శంకుస్థాపన చేసేందుకు వచ్చారని అన్నారు. ఆలయ భూమిపై కోర్టులో కేసు ఉండగా మంత్రి మల్లారెడ్డి దౌర్జన్యంగా తన అనుచరులతో అక్రమంగా ఆలయ నిర్మాణాలను చేపడుతున్నారని ఆలయ ట్రస్ట్ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆలయ ట్రస్ట్ సభ్యులకు ఏం జరిగినా.. పూర్తి బాధ్యత మంత్రి మల్లారెడ్డి వహించాల్సి ఉంటందని హెచ్చరించారు.