అడుగడుగునా అడ్డుకున్నరు ..మంత్రి మల్లారెడ్డి నిరసన సెగ

అడుగడుగునా అడ్డుకున్నరు ..మంత్రి మల్లారెడ్డి నిరసన సెగ

సొంత ఇలాకాలో మంత్రి మల్లారెడ్డికి  నిరసన సెగలు తగులుతున్నాయి. మేడ్చల్ నియోజకవర్గంలో అడుగడుగునా మంత్రి మల్లారెడ్డిని ప్రజలు అడ్డుకుంటున్నారు. తమ గ్రామాల్లో అభివృద్ధి పనులు ఎందుకు చేయడం లేదని  మంత్రి మల్లారెడ్డిని నిలదీస్తున్నారు. తాజాగా మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా శామీర్ పేట మండలంలోని పలు గ్రామాల్లో మంత్రి మల్లారెడ్డికి నిరసన సెగ తగిలింది. 

మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా  శామీర్ పేట మండలం బాబాగూడా, బొమ్మ రాసిపేట, పొన్నాల  గ్రామాల్లో మంత్రి మల్లారెడ్డి పాదయాత్ర నిర్వహించారు. ఈ పాదయాత్రను ఆయా గ్రామాల ప్రజలు అడ్డుకున్నారు. బొమ్మరాసిపెట గ్రామంలో రైతుల సమస్యలు సర్పంచ్ చెప్పుకుంటే పట్టించుకోవడంలేదని మంత్రికి చెప్పుకోడానికి వెళితే గ్రామ నాయకులు వారిని అడ్డుకున్నారు. దీంతో గ్రామస్తులు, రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అటు పొన్నాల గ్రామంలో సైతం మంత్రి మల్లారెడ్డిని గ్రామస్తులు నిలదీశారు. ఎలక్షన్లప్పుడు మాత్రమే తమ గ్రామం గుర్తుకొస్తుందని.. మిగతా రోజుల్లో మంత్రి మల్లారెడ్డికి గ్రామం గుర్తుకు రాదని మండిపడ్డారు. సమస్యలు చెప్పుకుందామని వెళ్తే..కాంగ్రెస్,బీజేపీ కార్యకర్తలంటూ మంత్రి మల్లారెడ్డి హేళన చేశారని విమర్శించారు. 

ఐదేళ్ల క్రితం పొన్నాల గ్రామాన్ని దత్తత తీసుకుంటానని హామీ ఇచ్చిన మంత్రి మల్లారెడ్డి...ఆ తర్వాత పట్టించుకోలేదని...ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడుతుండడంతో మళ్లీ తమ గ్రామానికి వచ్చాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.  పొన్నాల గ్రామంలో రోడ్లు, డ్రైనేజీలు అధ్వాన్నంగా ఉన్నాయని మంత్రి నిలదీశారు. ప్రజలు ప్రశ్నించడంతో మంత్రి మల్లారెడ్డి అక్కడి నుంచి వెళ్లిపోయారు.