
న్యూఢిల్లీ, వెలుగు: కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ అధ్యక్షతన స్నేహపూరిత వాతావరణంలో చర్చలు జరిగాయని ఏపీ ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఈ భేటీలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదాలపై ఉన్న సాంకేతిక (టెక్నికల్ ఇష్యూస్) సమస్యలపై చర్చించినట్లు చెప్పారు. ఎంతో కాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ సమస్యలను పరిష్కరించుకునేందుకు తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి అంగీకారం తెలిపారని వెల్లడించారు. భేటీ అనంతరం శ్రమశక్తి భవన్ ముందు ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘తెలుగు జాతి సంపద అయిన శ్రీశైలం ప్రాజెక్టును
కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ప్రాజెక్టుపై సీడబ్ల్యూసీ ఇచ్చిన రికమండేషన్స్ ఫాలో అవుతాం. ప్లంజ్ పూల్ రక్షణ చర్యలు చేపడ్తాం. రెండు రాష్ట్రాల్లో ఉన్న రిజర్వాయర్ల ఔట్‌ఫ్లోల వద్ద టెలీ మీటర్లు ఏర్పాటు చేసే అంశంపై చర్చించాం. టెలీ మీటర్లు ఏర్పాటుకు ఇద్దరు సీఎంలు అంగీకరించారు. కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు (కేఆర్‌ఎంబీ) ఏపీకి, గోదావరి రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు (బీఆర్‌ఎంబీ) తెలం గాణలో ఏర్పాటు చేసేలా చర్చలు జరిగాయి. కేఆర్‌ఎంబీ అమరావతిలో, బీఆర్‌ఎంబీ హైదరాబాద్‌లో నెలకొల్పేలా సీఎంలు అంగీకరించారు’’అని నిమ్మల
రామానాయుడు అన్నారు.