కల్లూరు, వెలుగు: రైతుల భూ సమస్యల శాశ్వత పరిష్కారం కోసం రీసర్వే చేపడుతున్నామని, ఈ సర్వేను ఏడాదిన్నరలో పూర్తిచేసి శాశ్వత పరిష్కారం చూపిస్తామని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లా కల్లూరు డీఎన్‌పీ ఫంక్షన్ హాల్‌లో గురువారం కల్లూరు, తల్లాడ మండలాల ప్రజాదర్బార్‌లో మంత్రి పాల్గొని మాట్లాడారు. సత్తుపల్లి క్లస్టర్ ప్రజా దర్బార్‌లో మొత్తం సుమారు 3,500 దరఖాస్తులు అందాయని తెలిపారు. సత్తుపల్లి, పాలేరు నియోజకవర్గంలో జరిగిన ప్రజా దర్బార్‌లో ఎక్కువ శాతం ఇందిరమ్మ గృహాలు మంజూరు కోసం దరఖాస్తులు వచ్చినట్లు చెప్పారు.
సత్తుపల్లి, కల్లూరు ప్రాంతాల్లో 50 ఏండ్లుగా ఉన్న సమస్యలను భూ రీ-సర్వే ద్వారా పరిష్కరిస్తున్నామన్నారు. ప్రతి ఒక్కరూ తమ ఎన్యూమరేషన్ ఫారాన్ని బీఎల్‌వోలకు ఆగస్టు 3లోపు తప్పనిసరిగా అందజేసి ఓటు హక్కును పరిరక్షించుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్ మాట్లాడుతూ నియోజకవర్గానికి అదనంగా 1,000 ఇందిరమ్మ ఇళ్లు, కల్లూరు మున్సిపాలిటీకి రూ.20 కోట్లు మంజూరు చేయాలని మంత్రిని కోరారు.
