మహబూబాబాద్, వెలగు: జిల్లాలో 22ఏ నిషేధిత భూముల జాబితా, భూ సమస్యలపై నిబంధనలకు విరుద్ధంగా సొంత నిర్ణయాలు తీసుకోవద్దని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆఫీసర్లను ఆదేశించారు. సోమవారం సాయంత్రం మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయి సమీక్షలో ఆయన మాట్లాడారు. అధికారులు బాధ్యతాయుతంగా, పారదర్శకంగా విధులు నిర్వహించి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. అక్రమాలకు పాల్పడి ప్రజలను ఇబ్బందులకు గురిచేసే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
కార్యాలయాలకే పరిమితం కాకుండా ప్రతి నెల కనీసం రెండుసార్లు క్షేత్రస్థాయిలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేసి, బిల్లుల చెల్లింపుల్లో జాప్యం చేయవద్దని సూచించారు. సమావేశంలో మంత్రి సీతక్క, ప్రభుత్వ విప్ జాటోత్ రామచంద్రునాయక్, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి, ఎంపీలు కడియం కావ్య, పోరిక బలరాం నాయక్, ఎమ్మెల్యేలు భూక్యమురళీ నాయక్, నాగరాజు, గండ్ర సత్యనారాయణ, యశస్విని రెడ్డి, ఆయా జిల్లాల కలెక్టర్లు, తదితరులు పాల్గొన్నారు.
