ధర్మపురిలో సబ్ రిజిస్ట్రార్, ఆర్డీవో ఆఫీస్​లు

ధర్మపురిలో సబ్ రిజిస్ట్రార్, ఆర్డీవో ఆఫీస్​లు
  • ప్రభుత్వం ప్రకటించే జాబితాలో ధర్మపురి పేరే ఫస్ట్ ఉంటది
  • భూభారతి రెవెన్యూ సదస్సులో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

జగిత్యాల, వెలుగు: 18 రాష్ట్రాల్లో భూ సమస్యల పరిష్కారంపై అధ్యయనం చేసి, మేధావులతో విస్తృతంగా చర్చించిన తర్వాతనే భూభారతి చట్టం తీసుకువచ్చామని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. భూభారతి పైలట్ ప్రాజెక్టులో భాగంగా శనివారం జగిత్యాల జిల్లా బుగ్గారంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సును ఆయన హాజరయ్యారు. పలువురు రైతులకు భూహక్కు పత్రాలు పంపిణీ చేశారు. భూభారతితో రాష్ట్రంలో రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేస్తామన్నారు.

జూన్ 2న రాష్ట్రంలోని పది వేలకు పైగా రెవెన్యూ గ్రామాలకు రెవెన్యూ అధికారులకు కేటాయిస్తామని వెల్లడించారు. ధర్మపురిలో ఆర్డీవో, సబ్ రిజిస్టర్ కార్యాలయాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా మంత్రి వెల్లడించారు. ప్రభుత్వం ప్రకటించే జాబితాలో ధర్మపురి పేరే మొదటగా ఉంటుందన్నారు. ఎండపల్లి, బీర్పూర్ మండలాలకు సొంత కార్యాలయాలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ నెలాఖరు వరకు నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇండ్ల చొప్పున లబ్ధిదారులను ఎంపిక చేస్తామని, వచ్చే నాలుగేండ్లలో రాష్ట్రంలో 20 వేల ఇండ్లను ప్రజలకు అందజేస్తామన్నారు. సదస్సులో ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్యే సంజయ్ కుమార్, కలెక్టర్ సత్యప్రసాద్ ఉన్నారు.