సాగ‌ర్ కాల్వ యూటీ ప‌నులు స్పీడప్​ చేయాలి : పొంగులేటి శ్రీనివాసరెడ్డి

 సాగ‌ర్ కాల్వ యూటీ ప‌నులు స్పీడప్​ చేయాలి : పొంగులేటి శ్రీనివాసరెడ్డి
  • జూలై 10లోగా నీటిని  విడుద‌ల చేయాల్సిందే..
  • మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి 

కూసుమంచి/మధిర, వెలుగు : --ఖ‌మ్మం జిల్లాలో సుమారు నాలుగు ల‌క్షల ఎక‌రాల‌కు సాగునీటిని అందించే  పాలేరులోని నాగార్జున సాగ‌ర్ ఎడ‌మ కాల్వ యూటీ(అండర్ టన్నెల్​) నిర్మాణ ప‌నులు స్పీడప్​ చేయాలని మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. కూసుమంచి మండలం హాట్యాతండా వద్ద వరదలతో కాల్వకు గండి పడి యూటీ కొట్టుకుపోయింది. అక్కడ కొత్తగా చేపడుతున్న యూటీ నిర్మాణ పనులను మంత్రి శుక్రవారం పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ జూలై 10లోగా పనులు పూర్తి చేసి రైతాంగానికి నీటిని విడుద‌ల చేయాల‌ని అధికారులను ఆదేశించారు. శాశ్వత ప్రాతిప‌దిక‌న రూ. 14.20 కోట్లతో  యూటీ రిపేర్లు చేపడుతున్నట్లు తెలిపారు. అనంతరం పాలేరులో 37 మందికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు కాగా, అందులో ఆరుగురికి ఇండ్ల మంజూరు పత్రాలను మంత్రి అందజేశారు. 

నాయకన్​గూడెం, పాలేరు, జీళ్లచెరువు, మధిర నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో జరిగిన వివాహాలకు హాజరై నూతన వధువరులను ఆశీర్వదించారు. ఇటీవల మృతి చెందిన బాధిత కుటుంబాలను పరామర్శించారు.  మంత్రి వెంట కూసుమంచిలో ఇరిగేషన్​ ఎస్ఈ ఎం. వెంకటేశ్వర్లు, డీఈ రమేశ్​రెడ్డి, మాధవి, ఎంపీడీవో వేణుగోపాల్​రెడ్డి, సీడీసీ చైర్మన్​ సూర్యానారాయణరెడ్డి, బజ్జూరి వెంకటరెడ్డి, సుధాకర్​రెడ్డి, మధిరలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు డాక్టర్​ కోట రాంబాబు, దేవిశెట్టి రంగారావు, కటికల సీతారామి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.