పొంగులేటిపైనే ఖమ్మం భారం!

పొంగులేటిపైనే ఖమ్మం భారం!
  • కాంగ్రెస్​ అభ్యర్థి రఘురాంరెడ్డి గెలుపు కోసం కసరత్తు
  • ఖమ్మం పార్లమెంటు ఎన్నికల ఇన్​చార్జిగా ఉన్న పొంగులేటి 
  • స్వయంగా వియ్యంకుడు కావడంతో పోరు మరింత ప్రతిష్టాత్మకం

ఖమ్మం, వెలుగు :  ఖమ్మం పార్లమెంట్ కాంగ్రెస్​ అభ్యర్థి రామసహాయం రఘురాంరెడ్డి గెలుపు బాధ్యత మొత్తం రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డిపై పడింది. ఇంతకు ముందే ఖమ్మం లోక్​ సభ సెగ్మెంట్ కు ఎన్నికల ఇన్​చార్జిగా పొంగులేటిని ఏఐసీసీ నియమించింది. ఇప్పుడు ఎంపీ టికెట్​ను సొంత వియ్యంకుడే దక్కించుకోవడంతో ఈ ఎన్నికల పోరు పొంగులేటికి మరింత ప్రతిష్టాత్మకంగా మారింది. 

నిన్న, మొన్నటి వరకు తమ కుటుంబ సభ్యులకు టికెట్​ కోసం తీవ్ర ప్రయత్నాలు చేసిన డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావును సమన్వయం చేసుకోవడం, టికెట్​ ఆశించి భంగపడ్డ ఇతర నేతలను కూడా కలుపుకొని పోవడం, ఇండియా కూటమిలో భాగస్వామ్యులుగా ఉండి ఖమ్మంలో ఓటు బ్యాంక్​ ఉన్న కమ్యూనిస్టు పార్టీలను కూడా ఎన్నికల ప్రచారంలో ఉపయోగించుకోవడం లాంటి అంశాలను పొంగులేటి నేరుగా చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

 నామినేషన్ల దాఖలుకు చివరి రోజు బీఫామ్​ దక్కడంతో ఎన్నికల వ్యూహాలు రచించుకునేందుకు కూడా కాంగ్రెస్​ అభ్యర్థికి తగిన సమయం లేకుండా పోయింది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం పార్లమెంట్ పరిధిలోని ఆరు చోట్ల కాంగ్రెస్, మరొక్క చోట కాంగ్రెస్​ సపోర్ట్ తో సీపీఐ అభ్యర్థి గెలిచారు. ఈ కారణంగా హస్తం పార్టీకి ఖమ్మంలో కొంత సానుకూల పరిస్థితి కనిపిస్తున్నా, మిగిలిన సమయాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవడంపైనే ఆ పార్టీ విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి.

ఇక్కడి రాజకీయాలకు రఘురాంరెడ్డి కొత్తే!

కాంగ్రెస్​ అభ్యర్థి రఘురాంరెడ్డి సొంతూరు కూసుమంచి మండలం చేగొమ్మ అయినా.. వారి కుటుంబం, తండ్రి సురేందర్​ రెడ్డి పొలిటికల్​ కెరీర్ మొత్తం ఉమ్మడి వరంగల్ జిల్లా కేంద్రంగానే సాగింది. నాలుగు సార్లు డోర్నకల్​ ఎమ్మెల్యేగా, నాలుగుసార్లు వరంగల్ ఎంపీగా సురేందర్​ రెడ్డి పనిచేశారు. ఆ ఎన్నికల సమయంలో సురేందర్​ రెడ్డి తరఫున రఘురాంరెడ్డి పార్టీలో కీలకంగా పనిచేశారు. 

ఆయా నియోజకవర్గ పార్టీ ఇన్​చార్జిగానూ వ్యవహరించారు. అయితే హైదరాబాద్​ కేంద్రంగా వ్యాపార రంగంలో  స్థిరపడడంతో గత రెండు దశాబ్దాల నుంచి రఘురాంరెడ్డి ప్రత్యక్ష రాజకీయాలకు కొంత దూరంగానే ఉన్నారు. ఈ కాలంలో ఒకసారి పాలకుర్తి, మరోసారి పాలేరు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని భావించినా అవకాశం దక్కలేదు. దీంతో ఖమ్మం పార్లమెంట్ పరిధిలో రాజకీయాలు రఘురాంరెడ్డికి కొత్తే. స్థానిక నాయకులు గానీ, ఇతర భాగస్వామ్య పార్టీల లీడర్లుగానీ పరిచయం లేదు. పోలింగ్ కు కూడా మూడు వారాల్లోపే సమయముంది. ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులు ఇప్పటికే రెండో విడత ప్రచారంలో ఉండగా, కాంగ్రెస్​ అభ్యర్థి మాత్రం ఇప్పుడు వ్యూహాలను సిద్ధం చేసుకునే పరిస్థితి ఏర్పడింది. అతి తక్కువ సమయంలో ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లను కవర్​ చేయడం, ఓటర్లను కలుసుకోవడం కత్తి మీద సాముగా మారింది. దీంతో ఈ ఎన్నికలకు సంబంధించి అన్ని వ్యవహారాల్లోనూ పొంగులేటి తన సొంత ఎన్నికలుగానే భావించి పనిచేయాల్సి ఉంది. 

మరింత బాధ్యత.. 

2014 పార్లమెంట్ ఎన్నికల్లో పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఖమ్మం ఎంపీగా వైసీపీ నుంచి పోటీచేసి గెలిచారు. ఆ ఎన్నికలతోనే పొంగులేటి పొలిటికల్​ ఎంట్రీ ఇచ్చారు. కాంగ్రెస్​ కు కంచుకోట లాంటి ఖమ్మంలో వైసీపీ తరఫున విజయం సాధించారు. ఆ ఎలక్షన్లతోనే పొంగులేటి సత్తా బయటపడింది. తర్వాత పరిస్థితుల్లో ఆయన బీఆర్ఎస్​లో చేరడం, ఆ పార్టీలో ఎలాంటి అవకాశాలు రాకపోవడంతో గత ఐదేళ్లు ఏ పదవీ లేకుండా ఖాళీగా ఉన్నారు. గతేడాది కేసీఆర్​ ను సవాల్​ చేసి మరీ ఉమ్మడి జిల్లాలో బీఆర్ఎస్​ అభ్యర్థులను ఓడించారు. 

ఒక్కరిని కూడా అసెంబ్లీ గేటు తాకనివ్వనంటూ చెప్పిన మాటను ఎన్నికల్లో నిలబెట్టుకున్నారు. ఇప్పుడు ఖమ్మం పార్లమెంట్ పరిధిలో కాంగ్రెస్​ కు సానుకూల పరిస్థితులున్నాయి. సొంత తమ్ముడు ప్రసాద్​ రెడ్డికి టికెట్​ ఇప్పించుకునే విషయంలో కొంత ఫెయిల్ అయినా.. తన కుటుంబాన్ని వదిలి పార్టీ టికెట్ బయటకు వెళ్లకుండా చూసుకోవడంలో విజయం సాధించారు. దీంతోనే పార్టీలో తన పట్టును నిరూపించుకున్నారు. అయితే ఈ ఎన్నికల్లో భారీ మెజార్టీతో రఘురాంరెడ్డిని గెలిపించి, పార్టీ ఆయనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిరూపించుకోవాల్సిన బాధ్యత పొంగులేటిపైనే ఉంది.