అర్హులందరికీ సంక్షేమ ఫలాలు : మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

అర్హులందరికీ సంక్షేమ ఫలాలు : మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
  •  పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు 

ఖమ్మం టౌన్/ఖమ్మం రూరల్, వెలుగు : అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందిస్తూ,  పేదోడికి భద్రత, భరోసా కల్పిస్తున్న ప్రభుత్వం తమదని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. బుధవారం ఖమ్మం రూరల్ మండలంలో పర్యటించిన ఆయన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. తొలుత కామాంచికల్ లో రూ.30 లక్షలతో నిర్మించనున్న అంతర్గత సీసీ రోడ్డు నిర్మాణ పనులకు కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడుతూ గత 20 నెలల్లో కామాంచికల్ గ్రామంలో రూ.94 లక్షలతో అంతర్గత సీసీ రోడ్లు నిర్మించామని, ఇప్పుడు మరో రూ.30 లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయడం సంతోషంగా ఉందని తెలిపారు

. కామంచికల్ నుంచి పాపటపల్లి వరకు బీటి రోడ్డు నిర్మాణానికి రూ.17 కోట్లు, కోయచిలక వరకు బీటీ రోడ్డుకు రూ.2.10 కోట్లు,  శ్మశాన వాటిక వరకు బీటి రోడ్డుకు రూ. 90 లక్షలు, తీర్థాల రోడ్డు రిపేర్లకు రూ.25 లక్షలు మంజూరు చేసినట్లు వివరించారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల అడిషనల్​ కలెక్టర్ శ్రీజ, జిల్లా పౌరసరఫరాల అధికారి చందన్ కుమార్, జిల్లా వ్యవసాయ అధికారి పుల్లయ్య, జిల్లా సహకార అధికారి గంగాధర్, జిల్లా ఉద్యానవన అధికారి మధుసూదన్, ఇరిగేషన్ ఎస్ఈ వెంకటేశ్వర్లు, ఆర్ అండ్ బీ ఎస్ఈ యాకోబ్, ఖమ్మం ఆర్డీవో నర్సింహారావు, విద్యాశాఖ ఈఈ బుగ్గయ్య, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. 

ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతాం

దానవాయిగూడెం గురుకులాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఖమ్మం మున్సిపల్​ కార్పొరేషన్  దానవాయిగూడెంలో టీజీఎస్​డబ్ల్యూఆర్ పాఠశాల, జూనియర్ కళాశాల (బాలికలు) భవన రిపేర్లకు బుధవారం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, సీపీ సునీల్ దత్ తో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. గతేడాది మున్నేరు ముంచెత్తినప్పుడు పాఠశాలలోని విద్యార్థులు బిక్కు బిక్కు మంటూ గడిపారని, ఆనాడు పిల్లలకు ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకు రిపేర్ల కోసం రూ.3.80 కోట్లు  కేటాయించినట్లు తెలిపారు. 

 లో లెవల్ పాఠశాలకు ఎర్త్ ఫిల్లింగ్, అంతర్గత సీసీ రోడ్లు, కాంపౌండ్, వెయిటింగ్ హాల్, జనరేటర్ ఏర్పాటు కోసం ఈ నిధులను వినియోగించుకోవాలని, యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేయాలని సూచించారు. బాలికలు కోరితే ఇక్కడ స్థానికంగా క్రికెట్ గ్రౌండ్ ఏర్పాటుకు అవకాశాలు పరిశీలించాలని కలెక్టర్ కు సూచించారు. కలెక్టర్ మాట్లాడుతూ మంత్రి చొరవతో బాలికల గురుకుల పాఠశాలకు నిధులు మంజూరు అయ్యాయన్నారు. సీపీ మాట్లాడుతూ గురుకుల పాఠశాలలను ఉన్నతాధికారులు రెగ్యులర్ గా తనిఖీ చేస్తూ పిల్లలకు అందించే ఆహారం నాణ్యతను పరిశీలించాలని సూచించారు.