అధికారులు జవాబుదారీతనంతో పనిచేయాలి : పొంగులేటి శ్రీనివాసరెడ్డి

అధికారులు జవాబుదారీతనంతో పనిచేయాలి : పొంగులేటి శ్రీనివాసరెడ్డి

ఖమ్మం టౌన్, వెలుగు :  ప్రభుత్వ అధికారులు జవాబుదారీతనంతో పనిచేయాలని రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. ఆదివారం నూతన కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో కలెక్టర్ వీపీ గౌతమ్ తో కలిసి పాలేరు నియోజకవర్గ అభివృద్ధి పనుల పురోగతిపై ఆయన సమీక్షించారు.  ప్రజలకు మెరుగైన సేవలు అందించి ప్రభుత్వ వ్యవస్థలపై నమ్మకం కలిగేలా చర్యలు చేపట్టాలన్నారు.

ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు 24 గంటలు అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం బోధనను పటిష్ట పరచాలని సూచించారు. మూతపడిన స్కూళ్ల వివరాలు సమర్పించాలని చెప్పారు. స్కూళ్లలో అన్ని సౌకర్యాలు ఉండేలా చూడాలన్నారు. నర్సింగ్ కళాశాల భవనం నాణ్యత ప్రమాణాలతో అగ్రిమెంట్ సమయంలోగా పూర్తి చేయాలని సూచించారు. తిరుమలాయపాలెం కమ్యూనిటీ హెల్త్ సెంటర్ 30 పడకల నుంచి 100 పడకలకు అప్ గ్రేడ్ అయిందని, అందుకు అనుగుణంగా భవనాల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలన్నారు.

నేలకొండపల్లి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఆపరేషన్ థియేటర్, కాంపౌండ్ వాల్ తదితర పనులు త్వరగా పూర్తి చేయాలని చెప్పారు. కూసుమంచిలో ఆయుష్ భవన నిర్మాణం పూర్తి చేయాలన్నారు. టెండర్ ప్రక్రియలో ఉన్న చెక్ డ్యామ్ పనుల వివరాలు ఇవ్వాలని కోరారు. పాలేరు కెనాల్ మెయిన్ అప్ స్ట్రీమ్, డౌన్ స్ట్రీమ్ లో ఉన్న భూములన్నీ డిమార్క్​ చేసి ఫెన్సింగ్ చేపట్టాలన్నారు. నాయకన్ గూడెం లో ఐబీ విశ్రాంతి గృహ నిర్మాణానికి టెండర్ రీకాల్ చేయాలని చెప్పారు. పెద్దతాండ, ఏదులాపురం, గుడిమల్ల, చిన్నవెంకటగిరి గ్రామాల్లో పురోగతిలో ఉన్న, ఇంకా ప్రారంభం కాని పనుల వివరాలు సమర్పించాలన్నారు.

మున్నేరు రిటైనింగ్ వాల్ నిర్మాణమై చర్యలు తీసుకోవాలని సూచించారు. లిఫ్ట్ ఇరిగేషన్లు అన్ని పనిచేసేలా చర్యలు చేపట్టాలన్నారు. గ్రామాల్లో విద్యుత్​ సమస్యల్లేకుండా చూడాలన్నారు. పశువులకు టీకాలు, మందుల సరఫరా చేయాలని చెప్పారు. గొర్రెల అభివృద్ధి పథకం విషయమై త్వరలో చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. సొంత భవనాలు మంజూరుకాని అంగన్వాడీ భవనాలు ఈజీఎస్ లో చేపట్టేందుకు ప్రతిపాదనలు సమర్పించాలని సూచించారు.

పాలేరు నియోజకవర్గానికి మంజూరయిన మినీ స్టేడియం నిర్మాణ పనులు వెంటనే ప్రారంభించాలని ఆదేశించారు. మిషన్ భగీరథ ద్వారా తాగునీరు సరఫరా అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. మద్దులపల్లి మార్కెట్ నిర్మాణ పనులు జులై లోపు పూర్తయ్యేలా పర్యవేక్షించాలని చెప్పారు. సమావేశంలో అడిషనల్​ కలెక్టర్లు బీ. సత్యప్రసాద్, డీ. మధుసూదన్ నాయక్, ఖమ్మం నగర పాలక సంస్థ కమిషనర్ ఆదర్శ్ సురభి, శిక్షణా సహాయ కలెక్టర్ మయాంక్ సింగ్,ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.