అసంపూర్తిగా ఉన్న డబుల్‍ ఇండ్లకు రూ.5 లక్షలిస్తాం

అసంపూర్తిగా ఉన్న డబుల్‍ ఇండ్లకు రూ.5 లక్షలిస్తాం
  • ఉమ్మడి వరంగల్​ ఇన్​చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి
  • మామునూర్‍ ఎయిర్‍పోర్ట్ భూసేకరణ త్వరగా చేయాలని ఆఫీసర్లకు ఆదేశం
  • టెక్స్​టైల్‍ పార్కులో సెప్టెంబర్‍ నాటికి పనులు పూర్తి చేయాలని సూచన
  • గ్రేటర్‍ వరంగల్‍ అభివృద్ధిపై హైదరాబాద్‍లో రివ్యూ
  • పాల్గొన్న మంత్రులు కొండా సురేఖ, సీతక్క

వరంగల్‍, వెలుగు: ఓరుగల్లులో అసంపూర్తిగా ఉన్న డబుల్‍ బెడ్రూం ఇండ్ల పనులు పూర్తి చేసుకోడానికి రూ.5 లక్షల చొప్పున ఇస్తామని..ఆగస్ట్ 15 నాటికి వాటిని లబ్ధిదారులకు కేటాయించాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‍రెడ్డి పేర్కొన్నారు. గ్రేటర్‍ వరంగల్‍ అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్‍రెడ్డి, జిల్లాకు చెందిన మంత్రులు కొండా సురేఖ, సీతక్కతో పాటు ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, ఆఫీసర్లతో ఆయన హైదరాబాద్‍లోని సెక్రటేరియట్‍లో రివ్యూ చేశారు. 

ఇందిరమ్మ ఇండ్లు, మామునూర్‍ ఎయిర్‍పోర్ట్, భద్రకాళి ఆలయం, టెక్స్​టైల్‍ పార్క్, అండర్‍ గ్రౌండ్‍ డ్రైనేజీ, ఔటర్‍ రింగ్​రోడ్‍, రైల్వే అభివృద్ధి పనుల ప్రోగ్రెస్‍పై చర్చించారు.ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ.. వరంగల్‍ నగరాన్ని రాష్ట్ర రెండో రాజధానిగా అభివృద్ధి చేయాలనే సంకల్పంతో కాంగ్రెస్‍ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు.

 శ్రావణ మాసం మొదలైన 

నేపథ్యంలో ఇందిరమ్మ ఇండ్లకు ఇసుక అందించడం, బిల్లుల చెల్లింపులో ఇబ్బందులు రాకుండా చూడాలన్నారు. ఇండ్ల పనుల్లో సమస్యలు, ఫిర్యాదుల కోసం హైదరాబాద్‍ స్థాయిలో టోల్‍ఫ్రీ నంబర్‍ పెట్టనున్నట్లు చెప్పారు. సీఎం సూచన మేరకు రేషన్‍కార్డుల పంపిణీలో ఎమ్మెల్యేలను భాగస్వామ్యం చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. మామునూర్‍ ఎయిర్‍పోర్ట్ భూసేకరణ కోసం రూ.205 కోట్లు విడుదల చేసిన నేపథ్యంలో పనులు త్వరగా పూర్తి చేయాలన్నారు. 

కాకతీయ మెగా టెక్స్ టైల్‍ పార్కులోని రాజీవ్‍గాంధీ టౌన్‍షిప్‍లో ఆర్‍ఆర్‍ ప్యాకేజీ కింద 1,398 మంది లబ్ఢిదారులను గుర్తించి 863 ప్లాట్లు కేటాయించినట్లు తెలిపారు. సెప్టెంబర్‍ నెలాఖరు నాటికి మౌలిక సదుపాయాలు కల్పించే ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. స్థానిక యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఇచ్చేలా చూడాలన్నారు. 

వరంగల్‌‌ సిటీలో అండర్‍ డ్రైనేజీ పనులు మొదలుపెట్టాలే

వరంగల్‍ నగరంలో రూ.4,170 కోట్లతో 2057ను దృష్టిలో పెట్టుకుని అండర్‍ గ్రౌండ్‍ డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నామని, ఈ పనులు వీలైనంత త్వరగా ప్రారంభించాలని ఆదేశించారు. భద్రకాళి ఆలయ అభివృద్ధి పనుల పర్యవేక్షణకు తానే స్వయంగా వస్తానన్నారు. వచ్చే దసరా నాటికి మాడవీధులు, పూజారి నివాసం, విద్యుత్‍ అలంకరణ అందుబాటులోకి తెచ్చేలా ప్లాన్‍ చేయాలని సూచించారు. భద్రకాళి చెరువుపై రోప్‍ వే, గ్లాస్‍ బ్రిడ్జి పనులు వచ్చే డిసెంబర్‍ నాటికి కంప్లీట్‍ చేయాలన్నారు. 

చెరువు ప్రాంతంలో 3.5 లక్షల క్యూబిక్‍ మీటర్ల మట్టిని తరలించామని.. రూ.2.06 కోట్ల మట్టిని విక్రయించినట్లు పేర్కొన్నారు. ఆలయంలో ఇకనుంచి యంత్రాల సాయంతో భోజనాల తయారీ కార్యక్రమాన్ని చేపడతామని, ఇందుకు కావాల్సిన నిర్మాణాలు చేపట్టాలన్నారు.

జిల్లాలో క్రికెట్‍ స్టేడియానికి అవసరమైన భూమిని గుర్తించాలని సూచించారు. జిల్లాలోని హాస్టళ్లలో ఉండే విద్యార్థులకు, హస్పిటళ్లలో మెరుగైన వైద్యసేవలు అందేలా మండలానికో ప్రత్యేక అధికారిని నియమించాలని కలెక్టర్లను ఆదేశించారు. 

ఎంపీ బలరాం నాయక్‍, గ్రేటర్‍ మేయర్‍ గుండు సుధారాణి, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్‍రెడ్డి, కడియం శ్రీహరి, కేఆర్‍ నాగరాజు, రేవూరి ప్రకాశ్‍రెడ్డి, గండ్ర సత్యనారాయణ, మోహన్‍ నాయక్‍, ఎమ్మెల్సీలు బస్వరాజు సారయ్య, బండ ప్రకాశ్‍, పోచంపల్లి శ్రీనివాస్‍రెడ్డి, అంజిరెడ్డి, కుడా చైర్మన్‍ ఇనగాల వెంకట్రామిరెడ్డి, కలెక్టర్లు సత్యశారద, స్నేహ శబరీశ్, రాహుల్‍ శర్మ, రిజ్వాన్‍ బాషా షేక్‍, వరంగల్‍ సీపీ సన్‍ప్రీత్‍సింగ్‍, ఎస్పీలు పాల్గొన్నారు.