
- మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్
- పాల్గొన్న మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్, జిల్లా ఆఫీసర్లు
మెదక్ టౌన్, వెలుగు: రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున మరో 24 గంటల పాటు అన్ని జిల్లా అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఉమ్మడి పది జిల్లాలకు ప్రత్యేకంగా సీనియర్ అధికారులను నియమించనున్నట్లు రాష్ట్ర రెవెన్యూ, విపత్తుల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గురువారం సీఎం రేవంత్ రెడ్డి సూచనల మేరకు సచివాలయం నుంచి సీఎస్ రామకృష్ణారావుతో కలిసి ఆయా జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్పరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ... రాష్ట్ర వ్యాప్తంగా మరో రెండు మూడు రోజుల పాటు భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో కలెక్టర్లు, ఎస్పీలు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, ఎస్పీ డీవీ శ్రీనివాస్ రావు.
అడిషనల్ కలెక్టర్ నగేష్ పాల్గొనగా... రాబోయే 24 గంటలు రెడ్ అలెర్ట్‌గా ఉన్న మెదక్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యలపై పలు సూచనలు చేశారు. సహాయక చర్యలను పర్యవేక్షించేందుకు ఉమ్మడి జిల్లాలకు సీనియర్ అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమించామన్నారు. సెలవుల్లో ఉన్న అధికారులు, సిబ్బంది సెలవులను రద్దు చేసి వెనక్కి పిలిపించాలన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్రాజ్మాట్లాడుతూ.. మెదక్ జిల్లా వ్యాప్తంగా రెడ్అలెర్ట్ ప్రకటించామన్నారు. ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నట్టు వీడియో కాన్ఫరెన్స్‌లో వివరించారు.