
తిరుమల: మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే మల్లారెడ్డి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. మంగళవారం (సెప్టెంబర్ 9) వేకువజామున శ్రీవారి సుప్రభాత సేవలో ఇరువురు కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. టీటీడీ అధికారులు మంత్రి పొన్నం, ఎమ్మెల్యే మల్లారెడ్డికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం కుటుబ సమేతంగా ఆలయంలోకి వెళ్లిన పొన్నం, మల్లారెడ్డి శ్రీవారిని దర్శించుకున్నారు. టీటీడీ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.
ఈ సందర్భంగా మల్లారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. పుట్టిన రోజు సందర్భంగా ప్రతి సంవత్సరం స్వామివారి దర్శనానికి వస్తానని చెప్పారు. గత ఏడాది వచ్చినప్పుడు యూనివర్సిటీలు కావాలని స్వామివారిని కోరుకున్నానని గుర్తు చేసుకున్నారు. నా కోరిక మన్నించి దేవుడు నాకు దేశంలోనే మూడు పెద్ద డీమ్డ్ యూనివర్సిటీలు ఇచ్చి నడిపిస్తున్నారని అన్నారు. అనంతరం టీటీడీ నిబంధనలకు విరుద్ధంగా శ్రీవారి ఆలయం ముందు రాజకీయ ప్రసంగం చేశారు మల్లారెడ్డి.
10 ఏళ్లలో దేశంలోనే ఎక్కడ లేని విధంగా కేసీఆర్ తెలంగాణను అభివృద్ధి చేశారని అన్నారు. ప్రపంచంలోని మల్టీ నేషన్ కంపెనీలన్నింటినీ కేటీఆర్ హైదరాబాద్కు తీసుకొచ్చాడన్నారు. కానీ ప్రస్తుతం తెలంగాణలో ఎక్కడ పరిస్థితి బాగాలేదు.. రియల్ ఎస్టేట్ రంగంలో దేశంలో మెదటి స్థానంలో హైదరాబాద్ ఉండేది.. కానీ ప్రస్తుతం రియల్ ఎస్టేట్ రంగం కుదేలైందని వ్యాఖ్యానించారు.
ఒక్కప్పుడు ఆంధ్రలో ఆస్తులు అమ్ముకొని హైదరాబాద్కు వచ్చేవాళ్ళు.. ఇప్పుడు తెలంగాణ వాళ్లు ఏపీలో ఆస్తులు కొంటున్నారు, వ్యాపారాలు మొదలు పెడుతున్నారని.. మొత్తం సీన్ రివర్స్ అవుతుందని అన్నారు. ఆంధ్రలో సీఎం చంద్రబాబు బాగా అభివృద్ధి చేస్తున్నాడన్నారు. తెలంగాణలో మళ్ళీ కేసీఆర్ వస్తే పాత రోజులు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.