
- పకడ్బందీగా, పారదర్శకంగా భూభారతి చట్టం అమలు
సైదాపూర్/చిగురుమామిడి, వెలుగు: గ్రామీణ రెవెన్యూ వ్యవస్థ బలోపేతం అయితే భూ వివాదాలు పరిష్కారమవుతాయని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లా సైదాపూర్, చిగురుమామిడి మండలాల్లో మంగళవారం నిర్వహించిన భూభారతి అవగాహన సదస్సులకు మంత్రి హాజరయ్యారు. తొలుత సైదాపూర్ మండలంలో పెర్కపల్లిలో నిర్మించనున్న బ్రిడ్జి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. మండల కేంద్రంలో విశాల సహకార పరపతి సంఘం కొత్త భవనం, కల్యాణ మంటపాన్ని మంత్రి ప్రారంభించారు. భూభారతి అవగాహన సదస్సులో ఆయన మాట్లాడుతూ భూమిని ఆత్మగౌరవంగా భావించే రైతుకు ధరణి వచ్చాక మనశ్శాంతి లేకుండా చేసిందన్నారు.
ధరణి వ్యవస్థ వల్ల రైతు తన భూమిని అమ్ముకునే పరిస్థితి లేకుండా పోయిందని వాపోయారు. భూ సమస్యలన్నింటినీ పరిష్కరించడంతోపాటు భవిష్యత్తులో వివాదాలు రాకూడదనే లక్ష్యంతో ప్రభుత్వం భూభారతి చట్టాన్ని అమల్లోకి తెచ్చిందని వివరించారు. జూన్ 2 నుంచి ఈ చట్టం ద్వారా సమస్యలు పరిష్కరిస్తామని తెలిపారు. ప్రతి ఒక్కరి భూమికి భూధార్ సంఖ్య కేటాయిస్తామని తెలిపారు. భూమికు సంబంధించిన రికార్డులన్నీ ఏటా డిసెంబర్ 31న రికార్డు చేయడం జరుగుతుందని వెల్లడించారు. భూభారతి చట్టాన్ని పారదర్శకంగా, పకడ్బందీగా అమలుచేస్తామని అన్నారు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లు సజావుగా సాగుతున్నాయని తెలిపారు.
ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపికలో అత్యంత నిరుపేదలకు మొదటి ప్రాధాన్యమివ్వాలని, దఫాలుగా పేదలందరికీ ఈ పథకం వర్తింపజేయాలని అధికారులకు సూచించారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో తాగు, సాగునీటి అవసరాలు పూర్తిగా పరిష్కరిస్తామని అన్నారు. అనంతరం కలెక్టర్ పమేలా సత్పతి మాట్లాడుతూ భూభారతి చట్టం ద్వారా అధికారాల వికేంద్రీకరణ జరిగిందన్నారు. అధికారుల బాధ్యత, జవాబుదారీతనం పెరిగిందని తెలిపారు. అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, ఆర్డీవోలు మహేశ్వర్, రమేశ్‌బాబు, సహకార సంఘం చైర్మన్ కొత్త తిరుపతిరెడ్డి, ఏఎంసీ చైర్మన్ దొంత సుధాకర్, డీసీవో రామానుజాచార్య, డీఏవో భాగ్యలక్ష్మి, తహసీల్దార్లు రమేశ్, మంజుల, ఎంపీడీవో యాదగిరి పాల్గొన్నారు.