రాంచందర్రావు.. బీసీల వ్యతిరేకి .. అటువంటి వ్యక్తిని బీజేపీ అధ్యక్షుడిని చేసింది: మంత్రి పొన్నం

రాంచందర్రావు.. బీసీల వ్యతిరేకి .. అటువంటి వ్యక్తిని బీజేపీ అధ్యక్షుడిని చేసింది: మంత్రి పొన్నం
  • కిషన్​ రెడ్డి కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేసి బీసీకి ఇవ్వాలి
  • బీసీ బిల్లుకు అడ్డంపడే ప్రయత్నాలు మానుకోవాలి 
  • బీజేపీ కుట్రలను బలహీన వర్గాలు చూస్తూ ఊరుకోవని కామెంట్

కరీంనగర్, వెలుగు: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు బడుగు, బలహీన వర్గాల వ్యతిరేకి అని మంత్రి  పొన్నం ప్రభాకర్  విమర్శించారు. అటువంటి వ్యక్తికి బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఇచ్చిందని మండిపడ్డారు. కరీంనగర్​లో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికల సమయంలో బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని ప్రకటించిన బీజేపీ కనీసం శాసన సభాపక్ష నాయకుడి హోదా కూడా బీసీకి ఇవ్వలేకపోయిందన్నారు. బలహీన వర్గాలకు చెందిన  బండి సంజయ్ ని అకారణంగా అధ్యక్ష పదవి నుంచి తొలగించి ఆ పదవిని కిషన్ రెడ్డికి ఇచ్చారన్నారు. 

‘కేంద్ర మంత్రి కిషన్ రెడ్డీ.. ముందు మీరు కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసి అరవింద్, ఈటల, ఆర్ కృష్ణయ్యలో ఎవరికో ఒకరికి ఆ పదవి ఇవ్వండి. తర్వాత మమ్ముల్ని ప్రశ్నించండి. కాంగ్రెస్ పార్టీ బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తే పాయల్ శంకర్ లాంటి వాళ్లు శాసనసభలో మద్దతు తెలిపితే మీరు అడ్డంపడే ప్రయత్నం చేస్తున్నారు. బీజేపీ చేస్తున్న కుట్రలను బలహీన వర్గాలు చూస్తూ ఊరుకోవు. మేం అడుగుతున్న దానికి బీజేపీ జవాబు చెప్పాలి’ అని మంత్రి పొన్నం సవాల్ విసిరారు. 

బీసీ బిల్లుకు అడ్డంపడే ప్రయత్నాలను మానుకోవాలని సూచించారు. బలహీన వర్గాల నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న బీజేపీ ఎంపీలు.. బీసీ బిల్లు రాష్ట్రపతి దగ్గర ఆమోదం పొందేలా చూడాలన్నారు. తమ ప్రభుత్వం ఇటీవల చేపట్టిన మంత్రివర్గ విస్తరణలో ముగ్గురు మంత్రుల ఎంపికలో సామాజిక న్యాయం పాటించిందని గుర్తు చేశారు. ఆయన వెంట ఎమ్మెల్యేలు మేడిపల్లి సత్యం, కవ్వంపల్లి సత్యనారాయణ తదితరులు ఉన్నారు.