
= ఎవరు హక్కుదారులో.. ఎవరు వాటదారులో చెప్పేందుకు సందర్భం కాదు
= మిగితా రాష్ట్రాల్లోనూ బీజేపీ దీన్ని అమలు చేస్తే సంతోషిస్తం
హుస్నాబాద్: పేదోళ్లు కూడా సన్నం బువ్వ తినాలన్న ఉద్దేశ్యంతో ప్రభుత్వం రేషన్ దుకాణాల ద్వారా సన్న బియ్యం పంపిణీ చేస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సిద్దిపేట జిల్లా కోహెడలో సన్న బియ్యం లబ్ధిదారు తలారి చంద్రయ్య ఇంట్లో మంత్రి పొన్నం, కలెక్టర్ మను చౌదరి,ఇతర అధికారులతో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... సన్న బియ్యం కార్యక్రమం చారిత్రాత్మక నిర్ణయం దేశంలో మన రాష్ట్రంలో మాత్రమే ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. తెలంగాణను ఆదర్శంగా తీసుకొని మిగతా రాష్ట్రాల్లో రేషన్ షాపుల్లో సన్న బియ్యం పంపిణీ చేసేలా కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకుంటే తాను సంతోషిస్తామని అన్నారు.
‘ సన్న బియ్యం పంపిణీ ని రాద్దాంతం చేసే ప్రయత్నం చేయొద్దు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు న్యాయం చేయాలనీ చాలా కార్యక్రమాలు కొనసాగిస్తుంది. ఎవరు హక్కుదారులు ఎవరు వాటదారులు అనే సందర్భం ఇది కాదు. సన్న బియ్యం తింటున్న ప్రజలకు ఇంకా ఏవిధంగా మేలు చేయాలనే ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. ఒకవైపు సన్న బియ్యం మరోవైపు ఇందిరమ్మ ఇల్లు ,కొత్త రేషన్ కార్డులు ,200 యూనిట్ల ఉచిత విద్యుత్, మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం, గురుకులాల్లో నాణ్యమైన భోజనం అందించడానికి మెస్ చార్జీలు ,కాస్మోటిక్ ఛార్జీలు పెంచాం , ఉద్యోగ నియామకాలు చేశాం, సన్న వడ్లకి 500 బోనస్, కాంగ్రెస్ ప్రభుత్వం అనేక రకాల కార్యక్రమాలు చేపట్టింది. ’ అని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.
మల్లవ్వ మంచి భోజనం పెట్టింది
కోహెడలోని సన్న బియ్యం లబ్దిదారుడు తలారి చంద్రయ్య మల్లవ్వ ఇంట్లో మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులతో కలిసి భోజనం చేశారు. ఈ మేరకు సన్న బియ్యం పథకం ఎలా ఉంది..? అని మంత్రి మల్లవ్వను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా తాము రేకుల గుడిసెలో నివాసం ఉంటున్నట్లు చెప్పింది. మంత్రిని తమకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని కోరారు. ఈ మేరకు మల్లవ్వ మంచి భోజనం పెట్టిందన్న మంత్రి పొన్నం ప్రభాకర్ వారి కుంటుంబానికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.