- కుర్చీ వేసుకుని కడతామన్నోళ్లు ఏడ పోయిండ్రు
- హుస్నాబాద్‌ను మళ్లీ కరీంనగర్ జిల్లాలో కలిపే బాధ్యత నాదే
- దమ్ముంటే డెవలప్మెంట్ పై చర్చకు రావాలని ఎమ్మెల్సీకి
- మంత్రి పొన్నం ప్రభాకర్ సవాల్
హుస్నాబాద్, వెలుగు: గౌరవెల్లి ప్రాజెక్టును త్వరగా పూర్తి చేసి ఈ ప్రాంతాన్ని పచ్చగ జేసుడే తన లక్ష్యం అని, ఒకవేళ ఆ ప్రాజెక్టు కంప్లీట్ చేయకుంటే వచ్చే ఎన్నికల్లో ఓట్లడగనని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. శనివారం హుస్నాబాద్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్అభ్యర్థుల తరపున ప్రచారం నిర్వహించారు.
మంత్రి మాట్లాడుతూ..గత పదేళ్లలో కుర్చీ వేసుకుని మరీ ప్రాజెక్టులు కడతామని గప్పాలు కొట్టిన నాయకులు ఇప్పుడు ఎక్కడ దాక్కున్నారని మంత్రి ప్రశ్నించారు. హుస్నాబాద్ ముఖమే తెల్వని కొంతమంది బయట వ్యక్తులు ఇక్కడికి వచ్చి ఏదేదో మాట్లాడుతున్నారని, అట్లంటి వాళ్లను పొలిమేర దాటనివ్వబోమని హెచ్చరించారు.
దమ్ముంటే హుస్నాబాద్ డెవలప్మెంట్పై చర్చకు రావాలని ఎమ్మెల్సీ తక్కలపల్లి రవీందర్ కి సవాల్ విసిరారు. హుస్నాబాద్‌ను వరంగల్, సిద్దిపేట నగరాల కంటే తోపుగా మారుస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఇందుకోసం మాస్టర్ ప్లాన్‌తో పనులు మొదలుపెట్టినట్లు చెప్పారు. తమ హయాంలోనే హుస్నాబాద్‌కు ఇంజనీరింగ్, కరీంనగర్ కి లా కాలేజీలు వచ్చాయని గుర్తు చేశారు.
మంత్రి దామోదర రాజనర్సింహ సహకారంతో 250 పడకల ఆస్పత్రితో పాటు పీజీ మెడికల్ కాలేజీని తీసుకువస్తామన్నారు. కరీంనగర్, యాదగిరిగుట్ట వెళ్లేందుకు ఫోర్ లైన్ రోడ్ల పనులు వేగవంతం చేస్తున్నామని, హుస్నాబాద్‌ను తిరిగి కరీంనగర్ జిల్లాలో కలిపే బాధ్యత తనదేనని హామీ ఇచ్చారు. గత సర్కారు పదేళ్లలో ఒక్క డబుల్ బెడ్ రూం ఇల్లు ఇయ్యలే కానీ తమ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లు, 500 రూపాయలకే గ్యాస్, 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ ఇస్తూ పేదలకు అండగా ఉంటోందన్నారు.
హుస్నాబాద్‌లో వరద ముంపు లేకుండా ఎల్లమ్మ చెరువును అద్దం లెక్క మెరిపిస్తామని, కాల్వలను బాగు చేస్తామని మాట ఇచ్చారు. మున్సిపాలిటీలోని 20 వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ తిరుపతి రెడ్డి, వడ్డేపల్లి రమణ, కోమటి సత్యనారాయణ, బొలిశెట్టి శివయ్య, తదితరులు పాల్గొన్నారు.
