
- అధికారులు ప్రొటోకాల్ పాటించరా?: ఎంపీ రఘునందన్‌రావు
సిద్దిపేట రూరల్, వెలుగు: జిల్లాలో విద్యాభివృద్ధికి అధికారులు, ప్రజాప్రతినిధులు సమష్టిగా కృషి చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. శుక్రవారం సిద్దిపేట కలెక్టరేట్ లో ఎంపీ మాధవనేని రఘునందన్ రావు అధ్యక్షతన దిశ కమిటీ సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి ఎమ్మెల్సీలు మల్క కొమురయ్య, అంజిరెడ్డి, కలెక్టర్ మనుచౌదరి, అడిషనల్ కలెక్టర్లు గరిమ అగర్వాల్, అబ్దుల్ హమీద్, డీఆర్డీవో జయదేవ్ ఆర్య, జిల్లా అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ ఎంపీ రఘునందన్ రావు పూలమొక్కను అందజేశారు. అనంతరం మాట్లాడుతూ.. నేషనల్ హైవేల వెంట ఇంతకు ముందు తొలగించిన చెట్ల స్థానంలో మొక్కలు నాటాలని కోరారు.
అనంతరం ఎంపీ అభివృద్ధి పనులు పూర్తి చేయడంలో అధికారుల అలసత్వం, ప్రొటోకాల్ పాటించక పోవడం, అధికారుల గైర్హాజరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దుబ్బాక మండలం చిట్టాపూర్ గ్రామంలో ఎంపీ లాడ్స్ తో చేపట్టిన పనులు పూర్తి అయిప్రారంభోత్సవ కార్యక్రమానికి అధికారులు తనకు సమాచారాన్ని ఇవ్వకపోవడం దారుణమన్నారు. రూ. కోట్లు వెచ్చించి నిర్మించిన క్యాటిల్ షెడ్స్ నిరుపయోగంగా ఉండడంపై ఆగ్రహం వ్యక్తం చేసి వెంటనే వాటిని ఉపయోగంలోకి తీసుకురావాలన్నారు.
పదేళ్ల కింద తొగుట మండలం కాన్గల్ లో బ్రిడ్జి నిర్మాణం కోసం శంకుస్థాపన చేస్తే ఇప్పటి వరకు దాన్ని పూర్తి చేయకపోవడం దారుణమని వెంటనే పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలన్నారు. ఎన్సాన్ పల్లి రైతులకు, వ్యాపారులకు ఇబ్బంది కలగకుండా జాతీయ రహదారి 765 డీజీపై సిద్దిపేట లైబ్రరీ నుంచి రంగధాంపల్లి చివరి వరకు పిల్లర్స్ తో కూడిన ఫ్లై ఓవర్ నిర్మించేందుకు కేంద్రం అనుమతి ఇచ్చిందని తెలిపారు. హర్ ఘర్ సూర్య యోజన పథకం కింద దుద్దెడ గ్రామాన్ని తీసుకొని సోలార్ విద్యుత్ అందించాలని, నిర్మాణం పూర్తయి పెండింగ్ లో ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను లబ్ధిదారులకు అందించాలన్నారు.
అనధికారికంగా కాంట్రాక్ట్ వర్కర్లతో పనిచేయిస్తున్న విద్యుత్ లైన్ మెన్ లు, ఏఈలపై చర్యలు తీసుకోవాలన్నారు. క్వాలిఫైడ్ డాక్టర్లు లేని, ప్రైవేట్ ఆస్పత్రులను సీజ్ చేయాలని డీఎంహెచ్ వో ను ఆదేశించారు. సిద్దిపేట మున్సిపాలిటి లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కోసం కేంద్రం ఇచ్చిన నిధుల వివరాలను తెలపాలని ఎంపీ కోరగా మున్సిపల్ అధికారులు కమిషనర్ అశ్రిత్ కుమార్ మీటింగ్ కు రాలేదని చెప్పడంతో ఎంపీ ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపల్ కమిషనర్ పై చర్యలు తీసుకోవాలని అడిషనల్ కలెక్టర్ గరిమ అగర్వాల్‌ను ఆదేశించారు.
దిశ కమిటీ సభ్యుడిగా నత్తి శివకుమార్
గజ్వేల్: జిల్లా స్థాయిలో కేంద్ర పథకాల అమలు, పర్యవేక్షణ, సమన్వయం లక్ష్యంగా రూపొందించిన దిశ కమిటీ సభ్యుడిగా గజ్వేల్‌కు చెందిన బీజేపీ నాయకుడు నత్తి శివకుమార్ నియమితులయ్యారు. శుక్రవారం ఎంపీ రఘునందన్‌రావు ఈ విషయాన్ని ప్రకటించారు.
లక్ష్యం చేరని ఎంపీ లాడ్స్ కథనానికి స్పందన
ఈ నెల 15న లక్ష్యం చేరని ఎంపీ లాడ్స్.. వృథా అవుతున్న నిధులు శీర్షికన వెలుగు దినపత్రికలో ప్రచురితమైన కథనంపై ఎంపీ రఘునందన్ రావు స్పందించారు. 16, 17, 18వ లోకసభ ఎంపీ లాడ్స్ నిధుల ప్రగతిపై ఆరా తీశారు. ఇప్పటివరకు నిధులు మంజూరైనవి, పనులు ప్రారంభించినవి, పూర్తయిన వాటి వివరాలను అడిగి తెలుసుకున్నారు. వెంటనే పనులకు సంబంధించిన రిపోర్టును అందజేయాలని అధికారులను ఆదేశించారు.