
బీసీలకు స్థానిక సంస్థలు, విద్య, ఉద్యోగాల్లో 42 శాతం రిజర్వేషన్లు అమలుచేయడానికి మా నాయకుడు రాహుల్ గాంధీ సారథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో చిత్తశుద్ధితో పని చేస్తున్నాం. కామారెడ్డి డిక్లరేషన్ మొదలు, కుల గణన సర్వే, కేబినెట్ ఆమోదం, 42 శాతం రిజర్వేషన్లు పెంచుతూ శాసనసభలో చేసిన చట్టం గవర్నర్ నుంచి రాష్ట్రపతికి బిల్లు పంపేవరకు ఎక్కడా న్యాయపరమైన చిక్కులు లేకుండా అటు పార్టీ, ఇటు ప్రభుత్వం సమన్వయంగా పనిచేశాం. బీసీలకు రిజర్వేషన్లపై బీజేపీ నేతలు కడుపులో కత్తులు పెట్టుకొని అలుముకునే ప్రయత్నం చేస్తున్నారు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, బీజేపీ బీసీ ఎంపీలు మీ అధినాయకత్వాన్ని ఒప్పించి రాష్ట్రపతి దగ్గర ఉన్న బిల్లు ఆమోదింపజేయాలి. బీజేపీ, బీఆర్ఎస్ నేతలు రాజకీయాలకు అతీతంగా బీసీల రిజర్వేషన్లు పెంపునకు మాతో కలిసి ఢిల్లీ రావాలి.
తెలంగాణ ప్రభుత్వం బీసీలకు రాజకీయ, విద్య, ఉద్యోగాల్లో 42 శాతం రిజర్వేషన్లు పెంచుతూ చేసిన చట్టం రాష్ట్రపతి వద్ద ఆమోదం కోసం పెండింగ్ లో ఉంది. దీంతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, కేబినెట్ మంత్రులు ప్రత్యేక కార్యాచరణతో ముందుకు కదులుతున్నాం. మూడు రోజుల కార్యాచరణలో భాగంగా మంగళవారం 5వ తేదీన పార్లమెంట్లో తెలంగాణలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసే అంశంపై వాయిదా తీర్మానం అందించాం. ఈరోజు ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని భారీ ధర్నా చేపడుతున్నాం. ఈ ధర్నాలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్ సభ ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్, మంత్రులు, తెలంగాణ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, అన్ని పార్టీల నేతలు, దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఎంపీలు, ఇండియా కూటమి పార్టీల ఎంపీలు, దేశవ్యాప్తంగా ఇతర ముఖ్య నేతలు ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొంటారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను పెంచుతూ శాసనసభలో చేసిన చట్టం రాష్ట్రపతి దగ్గర పెండింగ్‌లో ఉండడంతో దానిని ఆమోదించాలని ఈ 7వ తేదీన రాష్ట్రపతికి వినతిపత్రాలు సమర్పిస్తాం. ఢిల్లీలో మూడు రోజుల కార్యాచరణ కోసం తెలంగాణ కాంగ్రెస్ బీసీ నేతలు వేలాదిమందిగా ప్రత్యేక రైలులో ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారు.
న్యాయపరమైన చిక్కులు లేకుండా కులగణన
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయడానికి న్యాయపరమైన ఇబ్బందులు లేకుండా తెలంగాణ ప్రజా ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో జాగ్రత్త చర్యలు తీసుకుంది. కామారెడ్డి డిక్లరేషన్‌ను అమలు చేయడానికి మా ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోంది. కర్నాటక, బిహార్ రాష్ట్రాల్లో చేసిన కులగణనలను అధ్యయనం చేయడం జరిగింది. అక్కడ వచ్చిన న్యాయపరమైన చిక్కులు తెలంగాణలో రాకుండా ఉండడానికి ముందు జాగ్రత్తగా చర్యలు తీసుకున్నాం. అందులో భాగంగా సంవత్సర కాలంలో నిర్ణయం నుంచి నివేదిక వరకు పూర్తి చేశాం. 2024 ఫిబ్రవరి 4న కులగణనపై తీర్మానం చేశాం. 2025 ఫిబ్రవరి 4వ తేదీన కేబినెట్ ఆమోదించి అదే రోజు అసెంబ్లీలో తీర్మానం చేసుకున్నాం.
ప్లానింగ్ కమిషన్ ద్వారా కుల సర్వే జరిగింది. కుల సర్వే ప్రశ్నావళిలో 57 ప్రశ్నలు ఉండగా అదనపు ఉప ప్రశ్నలతో కలిపి మొత్తం 77 ప్రశ్నలపై ఫీల్డ్‌లో సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల అంశాలకు సంబంధించిన సమాచారం సేకరించాం. రాష్ట్రంలో ప్రతి జిల్లాను 150 కుటుంబాలతో కూడిన ఎన్యూమరేషన్ బ్లాక్‌గా విభజించి, ప్రతి 10 మంది ఎన్యూమరేటర్లను పర్యవేక్షించడానికి ఒక సూపర్వైజర్ను నియమించాం. లక్షమందికిపైగా ప్రభుత్వ ఉద్యోగులతో ఈ కుల సర్వే పారదర్శకంగా నిర్వహించాం. ఎవరైతే సర్వేలో తమ వివరాలు నమోదు చేసుకోలేదో వారికి మరోసారి అవకాశం కల్పించాం. బిహార్‌లో చేసిన కుల సర్వే న్యాయ సంబంధ సమస్యలు ఎదుర్కోవడంతో అలాంటి సమస్యలు ఇక్కడ రాకుండా ఉండడానికి అన్ని రకాల జాగ్రత్త చర్యలు తీసుకున్నాం.
బీసీలు 56.36 శాతం
మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి నేతృత్వంలో కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేశాం. ఈ సర్వే ద్వారా సేకరించిన డేటాను షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు, వెనకబడిన తరగతులు రాష్ట్రంలోని ఇతను బలహీన వర్గాల సంక్షేమానికి విధానాల రూపకల్పన చేయడానికి ప్రభుత్వానికి ఉపయోగిస్తుంది. కుల గణన సర్వేలో బీసీలు 56.36 శాతం ఉన్నట్టు సర్వేలో తేలింది. కుల సర్వే అనంతరం స్థానిక సంస్థలు విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్ల శాతాన్ని పెంచుటకు 2025 ఫిబ్రవరి 27 వ తేదీన విశ్రాంతి ఐఎఎస్ అధికారి భూసాని వెంకటేశ్వరరావు అధ్యక్షతన ఏకసభ్య కమిషన్‌ను ఏర్పాటు చేశాం. ఆయన కుల సర్వే డేటాను అధ్యయనం చేసి విశ్లేషించి రాష్ట్రంలో సామాజిక, ఆర్థిక, విద్యా సంబంధమైన విషయాలలో వెనకబడిన తరగతుల వెనుకబాటుతనం ఇంకా కొనసాగుతుందని తెలుపుతూ 2025 మార్చిలో తన నివేదికను సమర్పించింది. విద్య, ఉపాధి, రాజకీయ ప్రాతినిధ్యంలో ప్రత్యేకించి స్థానిక సంస్థల్లో బీసీలకు కనీసం 42 శాతం రిజర్వేషన్ కోటాను భూసాని వెంకటేశ్వరరావు కమిషన్ సిఫారసు చేసింది. ఏక సభ్య కమిషన్.. ఒకటి విద్య, ఉద్యోగాలు మరొకటి స్థానిక సంస్థలలో బీసీల రిజర్వేషన్ కోటాను పెంచుటకు రెండు చట్టాలను సిఫార్సు చేసింది. ఏక సభ్య కమిషన్ ప్రతిపాదించిన 42శాతం రిజర్వేషన్లను రాష్ట్ర ప్రభుత్వం పరిశీలించిన తరువాత వెనకబడిన తరగతుల పౌరుల జనాభాకు వారి జనాభా నిష్పత్తికనుగుణంగా సరైన ప్రాతినిధ్యం లేకపోవుట గమనించి వారికి స్థానిక సంస్థల్లో ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్స్ స్థాయిని పెంచాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయానికి వచ్చింది. తదనుగుణంగా వెనుకబడిన తరగతుల ఉన్నతికి అభివృద్ధికిగాను స్థానిక సంస్థలు, విద్య, ఉపాధి కల్పనలు 42 శాతం రిజర్వేషన్లు పెంచాలని నిర్ణయం తీసుకుంది.
రాష్ట్ర కేబినెట్ఆమోదం
2025 మార్చి 6న రాష్ట్ర మంత్రి మండలి బీసీలకు 42 శాతం రిజర్వేషన్ పెంచుటకు ఆమోదం తెలిపింది. అనంతరం మార్చి 17న బీసీలకు స్థానిక సంస్థలు, విద్య, ఉద్యోగాల్లో 42 శాతం రిజర్వేషన్లు పెంచుతూ శాసన సభలో రెండు వేరువేరు బిల్లులు ప్రవేశపెట్టడం జరిగింది. శాసనసభలో ప్రవేశపెట్టిన బిల్లు గవర్నర్‌కి పంపి ఆయన న్యాయ సమీక్ష అనంతరం రాష్ట్రపతికి పంపడం జరిగింది. రాష్ట్రపతి ఆమోదం కోసం అప్పటినుంచి పెండింగ్‌లో ఉండటం, మరోవైపు సెప్టెంబర్ 30 నాటికి గ్రామపంచాయతీలకు ఎన్నికలు నిర్వహించి ఫలితాలు ప్రకటించాలని.. హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించినందున మరోసారి రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తూ గవర్నరుకు ఆర్డినెన్స్ పంపించడం జరిగింది. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో రాష్ట్రపతి దగ్గర పెండింగ్‌లో ఉన్న బిల్లును ఆమోదించాలని మా నాయకుడు రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఉన్న అన్ని పార్టీలను కలుపుకొని ఉద్యమ కార్యాచరణ తీసుకున్నాం. తెలంగాణ ఉద్యమంలో జేఏసీగా ఏర్పడి సబ్బండ వర్గాలు ఒక్కతాటిపైకి వచ్చి రాష్ట్రాన్ని ఎలా సాధించుకున్నామో ఇప్పుడు కూడా బీసీలకు సామాజిక న్యాయం రిజర్వేషన్ల పెంపు సాధించుకోవాలంటే పార్టీలకు రాజకీయాలకు అతీతంగా అందరం కలిసి ఢిల్లీలో కొట్లాడాలని నిర్ణయించుకున్నాం.
రిజర్వేషన్లు అడ్డుకోవాలని చూస్తున్న బీజేపీ
తెలంగాణలో బీజేపీ నేతలు ముస్లింల పేరుతో బీసీల రిజర్వేషన్లను అడ్డుకుంటున్న ప్రయత్నాన్ని తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. శాసనసభలో బీసీ బిల్లుకు మద్దతు తెలిపిన బీజేపీ నేతలు బిల్లు ఢిల్లీకి వెళ్లగానే ఎందుకు మాట మార్చారో సమాధానం చెప్పాలి. బీజేపీ పాలిత రాష్ట్రాలైన గుజరాత్, మహారాష్ట్ర, ఉత్తర ప్రదేశ్, టీడీపీతో పొత్తులో ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో ముస్లింలలో వెనుకబడిన వర్గాలవారికి రిజర్వేషన్లపై వ్యతిరేకించడం లేదు. తెలంగాణలో రిజర్వేషన్ల పెంపును వ్యతిరేకించడం బీసీ సమాజాన్ని అణగదొక్కడమే అవుతుంది. బడుగు, బలహీన వర్గాలకు సామాజిక న్యాయం కోసం కాంగ్రెస్ కృషి చేస్తుంటే బీజేపీ, బీఆర్ఎస్ బీసీలకు అన్యాయం చేస్తున్నాయి. బీజేపీకి 8 మంది ఎంపీలు, కేంద్ర మంత్రులు ఉన్నా కేంద్రంపై ఒత్తిడి తేలేని రాష్ట్ర బీజేపీ నేతలు బీసీ బిల్లుకు చట్టబద్ధత సాధ్యం కాదని బీసీలపట్ల వారికి ఉన్న వ్యతిరేకత మరోసారి నిరూపించుకున్నారు. బీజేపీలో కేంద్ర మంత్రి బండి సంజయ్, ఐదుగురు బీసీ ఎంపీలు ధర్మపురి అరవింద్, ఈటల రాజేందర్, ఆర్ కృష్ణయ్య తదితరులు బీసీలకు అన్యాయం జరగకుండా ఇకనైనా ముందుకురావాలి. మీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు బీసీల వ్యతిరేకి. బీజేపీ ముందు నుంచీ బీసీలపట్ల వివక్ష చూపుతోంది.
తెలంగాణలో ముఖ్యమంత్రి అభ్యర్థి బీసీ అని చెప్పి పార్టీ అధ్యక్షుడిగా ఉన్న బీసీ బండి సంజయ్‌ను తొలగించి కిషన్ రెడ్డిని అధ్యక్షుడిని చేశారు. బీజేఎల్పీ నాయకుడిగా ఒక్క బీసీ నేత పనికి రాలేదా... బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా సీనియర్ బీసీ నేతలు ఉన్నప్పటికీ బీసీల పట్ల వ్యతిరేకి రాంచందర్‌రావుకి అప్పగించారు. ఇకనైనా బీజేపీ బీసీ నేతలు దీనిని గమనించాలి.
దేశానికే దిక్సూచిగా తెలంగాణ
మా నాయకుడు రాహుల్ గాంధీ జిత్నే అబాధి ఉత్నే ఇసేదారీ అని భారత్ జోడోయాత్రలో దేశవ్యాప్తంగా పాదయాత్ర చేసే సందర్భంలో సామాజిక న్యాయం జరగాలంటే కుల గణనతోనే సాధ్యం అని, కేంద్రంలో అధికారంలోకి వస్తే కులగణన చేస్తామని హామీ ఇచ్చారు. అందులో భాగంగా తెలంగాణలో అధికారంలోకి రాగానే కామారెడ్డి డిక్లరేషన్ అమలుచేస్తూ కులగణన చేసి తెలంగాణ దేశానికే దిక్సూచిగా మారింది.ఆ తర్వాత తప్పని పరిస్థితుల్లో జన గణనలో కులగణన కూడా చేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. తెలంగాణలో కులగణన బీసీలకు రిజర్వేషన్లు పెంపుపై మా సీఎం రేవంత్ రెడ్డి చిత్తశుద్ధితో పనిచేశారు. ఇక్కడ న్యాయపరమైన చిక్కు లేకుండా పారదర్శకమైన సర్వే చేపట్టి, ఏకసభ్య కమిషన్ ను నియమించి బీసీలకు కాంగ్రెస్ పార్టీ ఛాంపియన్ అని నిరూపించారు. స్థానిక సంస్థల్లో 34 శాతం ఉన్న బీసీల రిజర్వేషన్లు 23 శాతానికి తగ్గించి బీసీలకు వ్యతిరేక పార్టీగా బీఆర్ఎస్ మారింది. అన్యాయం చేసినవారే ఎదురు ప్రశ్నించినట్టు ఇప్పుడు బీసీలపై బీఆర్ఎస్ మొసలి కన్నీరు కారుస్తోంది. గతంలో ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ధర్నా జరిగినప్పుడు 15 పార్టీలు మద్దతు తెలిపాయి. కానీ, బీఆర్ఎస్, బీజేపీలు మాత్రం మద్దతు తెలపలేదు. బీసీ బిల్లుకు మద్దతు తెలపకుండా బీజేపీ, బీఆర్ఎస్ ఇక్కడ నిరసనలు తెలపడం విడ్డూరంగా ఉంది.
- పొన్నం ప్రభాకర్,
రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి