కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాలే..ఇందులో ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు: పొన్నం

కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాలే..ఇందులో ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు: పొన్నం
  •     బీజేపీ నేతలు బీసీ, దళిత వ్యతిరేకులు
  •     ప్రధాని స్థాయిలో మోదీ దిగజారి మాట్లాడుతున్నరు
  •     ప్రధాని నియంతృత్వాన్ని ప్రజలే బొందపెడ్తారని వ్యాఖ్య

కరీంనగర్, వెలుగు :  కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావే అని, ఈ విషయంలో ఎలాంటి కన్ఫ్యూజన్ అవసరం లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. రాజేందర్ రావు పేరు మీద సోమవారం మంచి రోజు ఉండటంతో నామినేషన్ వేయించామని తెలిపారు. ఒకట్రెండు రోజుల్లో పార్టీ అధిష్టానం అధికారిక ప్రకటన చేస్తుందన్నారు. 

కరీంనగర్ డీసీసీ ఆఫీస్​లో ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావుతో కలిసి మంత్రి పొన్నం మీడియాతో మాట్లాడారు. ‘‘ఫస్ట్ ఫేజ్ ఎన్నికల తర్వాత మోదీ వెన్నులో వణుకు పుట్టింది. అందుకే కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ముస్లింలకు ఆస్తులు పంచుతదంటూ దిగజారి మాట్లాడుతున్నారు. ప్రధాని స్థాయిలో అన్ని వర్గాలకు ప్రాతినిథ్యం వహించాల్సిన మోదీ.. ఇంత నీచంగా మాట్లాడం సరికాదు. సుప్రీం కోర్టు సుమోటోగా తీసుకొని విచారణ జరపాలి. పదేండ్లలో హిందువుల కోసం మోదీ ఏం చేశారు? 2015లో జనగణన వివరాలు బయటపెట్టాలని చూస్తే కోర్టులో అఫిడవిట్ వేసి ఆపింది బీజేపీ ప్రభుత్వమే. బీసీ, దళితులకు బీజేపీ వ్యతిరేకం’’ అని విమర్శించారు. 

హిందువుల కోసం మీరేం చేశారు?

దేశంలోని మెజారిటీ రైతులు హిందువులే అని, వారికి వ్యతిరేకంగా ఎందుకు నల్ల చట్టాలు తెచ్చారని పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. ‘‘మీ ఐపీఎల్ టీమ్​లో మీకు మోదీ ఒక్కడే లీడర్. మా టీమ్ ఇండియా కూటమి. మాకు పెద్ద టీమ్ ఉంది. మోదీ మతతత్వవాది. రాహుల్ గాంధీ మానవతావాది. ఈ ఎన్నికల్లో ప్రజలు మోదీ నియంతృత్వాన్ని బొందపెడ్తరు’’అని హెచ్చరించారు. 

వేరే రాష్ట్రంలో పీజీ చేసినట్టు అఫిడవిట్​లో పేర్కొన్న బండి సంజయ్.. ఇంటర్, డిగ్రీ ఎక్కడ పాసయ్యారో చెప్పాలని డిమాండ్ చేశారు. మాతృత్వం దేవుడిచ్చిన వరమని, తల్లీబిడ్డల గురించి అవమానకరంగా మాట్లాడిన మూర్ఖుడు బండి సంజయ్ అని మండిపడ్డారు. స్టేట్ ప్రెసిడెంట్ పోస్టు నుంచి అధిష్టానం ఎందుకు తీసేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. 

కేసీఆర్, కేటీఆర్, వినోద్ వలస పక్షులు: వెలిచాల రాజేందర్ రావు

కేసీఆర్, కేటీఆర్, వినోద్ వలస పక్షులని వెలిచాల రాజేందర్ రావు అన్నారు. మానేరు ఒడ్డున ఉన్న డంప్ యార్డును తలించలేకపోయారని, గ్రానైట్ విషయంలో సంజయ్ మ్యాచ్ ఫిక్సింగ్ కు పాల్పడ్డారని ఆరోపించారు. దేవుడి పేరును రాజకీయాలకు వాడుకోవడం దౌర్భగ్యకరమన్నారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు ఆరేపల్లి మోహన్, కోడూరి సత్యనారాయణ గౌడ్, సిటీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, కర్ర సత్యప్రసన్న రెడ్డి తదితరులు పాల్గొన్నారు.