
- కరీంనగర్ ఫిల్మ్ సొసైటీలో ‘నరెడ్ల’ విగ్రహావిష్కరణ
కరీంనగర్, వెలుగు : అవినీతి, అక్రమాలపై, వినియోగదారుల హక్కుల కోసం పోరాడిన గొప్ప ఉద్యమకారుడు లోక్ సత్తా శ్రీనివాస్ అని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ కొనియాడారు. తన రాజకీయ గురువు చొక్కారావుతో పాటు లోక్ సత్తా శ్రీనన్నను కూడా మర్చిపోనని, తాను రాజకీయాల్లో రాణించడానికి సలహాలు, సూచనలు ఇచ్చారని గుర్తు చేశారు. కరీంనగర్ ఫిలిం సొసైటీలో ఏర్పాటు చేసిన నరెడ్ల శ్రీనివాస్ విగ్రహాన్ని శుక్రవారం మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పొన్నం మాట్లాడుతూ మాజీ మంత్రి చొక్కారావు దగ్గర తామిద్దరం కలుసుకునేవాళ్లమని, జిల్లా అభివృద్ధికి సంబంంధించిన అనేక అంశాలపై చర్చించే వాళ్లమని తెలిపారు.
తాను శ్రీనివాస్ తో కలిసి మహారాష్ట్ర రాలేగావ్ సిద్ధికి వెళ్లి వాటర్ షెడ్ లను పరిశీలించామని గుర్తు చేసుకున్నారు. ఫిలిం సొసైటీ లో కీలక సభ్యుడిగా ఉండి ప్రయోజనాత్మకమైన చిత్రాలను ప్రదర్శించడం ద్వారా ప్రజలను చైతన్య పరిచారని తెలిపారు. 2004లో తాను ఎమ్మెల్యే గా పోటీ చేసినప్పుడు యూనియన్ బ్యాంక్ నుంచి రుణం తీసుకొనేందుకు సాయం చేశారని, తనలాగే వేలాది మంది ఆర్థికంగా ఎదిగేందుకు లోన్లు ఇచ్చి సహకరించారని చెప్పారు.
ఫిలిం సొసైటీకి అనువుగా ఉండే స్థల సేకరణకు కలెక్టర్ సానుకూలంగా ఉన్నారని, ఆడిటోరియం నిర్మాణానికి నిధులు ఇప్పించే బాధ్యత తనదని తెలిపారు. కలెక్టర్ పమేలా సత్పతి, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, ఎంజేపీ గురుకులాల జాయింట్ సెక్రటరీ జీవీ శ్యాంప్రసాద్ లాల్, కరీంనగర్ ఫిలిం సొసైటీ అధ్యక్షుడు పొన్నం రవిచంద్ర, లక్ష్మీగౌతం, వరాల మహేశ్ పాల్గొన్నారు.