గ్రామ స్థాయిలో కొత్త రక్తాన్ని తీసుకురావాలి : మంత్రి పొన్నం ప్రభాకర్​

గ్రామ స్థాయిలో కొత్త రక్తాన్ని తీసుకురావాలి : మంత్రి పొన్నం ప్రభాకర్​
  • స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలి
  • పార్టీ కార్యకర్తలతో మంత్రి పొన్నం ప్రభాకర్​ 

చిగురుమామిడి, వెలుగు: గ్రామ స్థాయిలో కొత్త రక్తాన్ని తీసుకొచ్చి, స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలంటూ రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్​ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణ సన్నాహక సమావేశం గురువారం కరీంనగర్​జిల్లా చిగురుమామిడి మండలకేంద్రంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్‌‌‌‌గా హాజరైన 
మంత్రి పొన్నం.. మండల, గ్రామ, బ్లాక్ అధ్యక్షుల ఎంపికకు పీసీసీ పరిశీలకుడు రఘునాథ్ రెడ్డి, నమిలా శ్రీనివాస్‌‌‌‌తో కలిసి దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంస్థాగతంగా పార్టీని గ్రామగ్రామాన పునర్‌‌‌‌‌‌‌‌వ్యవస్థీకరించాలన్నారు. 

గ్రామ శాఖ అధ్యక్షులను ఏకగ్రీవంగా ఎన్నుకొనే ప్రయత్నం చేయాలని సూచించారు. ఇప్పటివరకు ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలను ఇంటింటికి తీసుకెళ్లాలని సూచించారు. ‘మీ బిడ్డగా నన్ను ఆదరించి గెలిపించారు. అన్నివేళలా అందుబాటులో ఉంటూ పనిచేస్తున్నా.. నాకు ఇంకా బలం రావాలంటే రానున్న సర్పంచ్‌‌‌‌, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో విజయం సాధించేందుకు కృషి చేయాలి’ అని కార్యకర్తలను కోరారు. 

ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నాం

అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నరలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నామని మంత్రి పొన్నం చెప్పారు. ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌‌‌‌, రూ.500కే గ్యాస్​సిలిండర్‌‌‌‌, రైతులకు రూ.2లక్షల రుణమాఫీ, సన్నబియ్యం, సన్న వడ్లకు రూ.500 బోనస్‌‌‌‌ వంటి పథకాలతోపాటు ఏడాదిలోపే 60 వేల ఉద్యోగాలు భర్తీ చేశామన్నారు. ప్రతి ఏటా నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నామన్నారు. గ్రామాల్లో సీసీ రోడ్లు, తాగునీటి సమస్యలు లేకుండా చేస్తున్నామన్నారు. తన కోసం హైదరాబాద్ వచ్చే వారిలో హుస్నాబాద్‌‌‌‌ వాళ్లకే  ప్రాధాన్యమిస్తానన్నారు.