రాష్ట్రంలో భారీ వర్షాలు.. అధికారులకు మంత్రి పొన్నం కీలక ఆదేశం

రాష్ట్రంలో భారీ వర్షాలు.. అధికారులకు మంత్రి పొన్నం కీలక ఆదేశం

కరీంనగర్, వెలుగు: భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా ఆఫీసర్లు అలర్ట్‌‌గా ఉండాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. ప్రాజెక్టుల పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, ఆఫీసర్లు ఫీల్డ్‌‌ లెవల్‌‌లో అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ఆదివారం కరీంనగర్‌‌ కలెక్టరేట్‌‌నుంచి జీహెచ్‌‌ఎంసీ, సిద్దిపేట, కరీంనగర్, హనుమకొండ, సిరిసిల్ల జిల్లాల ఆఫీసర్లతో టెలీ కాన్ఫరెన్స్‌‌ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సిద్దిపేట – హనుమకొండ రోడ్డుపై భారీగా వరద నీరు పారుతున్నందున ప్రత్యేక టీమ్‌‌ను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. 

సిద్దిపేట జిల్లా కోహెడ మండలం రామచంద్రాపూర్‌‌ కాంగ్రెస్‌‌ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు బొబ్బల కనుకారెడ్డి వరద కాల్వలో గల్లంతయ్యారని తెలియడంతో ఆయన ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టాలని చెప్పారు. గ్రేటర్‌‌ హైదరాబాద్‌‌, హిమాయత్‌‌ సాగర్‌‌, ఉస్మాన్‌‌సాగర్‌‌ తాజా పరిస్థితిని జీహెచ్ఎంసీ కమిషనర్‌‌ ఆమ్రపాలి, సీపీ శ్రీనివాస్‌‌రెడ్డి, హైదరాబాద్‌‌ కలెక్టర్‌‌ అనుదీప్‌‌ దురశెట్టిని అడిగి తెలుసుకున్నారు. నగరంలోని 141 వాటర్‌‌ లాగింగ్‌‌ పాయింట్ల వద్ద మోటార్లు పెట్టి నీటిని పంపింగ్‌‌ చేయాలని, ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు.

 మరో రెండు రోజులు భారీ వర్షాలు ఉన్నందున ఆఫీసర్లు అలర్ట్‌‌గా ఉండాలన్నారు. రివ్యూకు కరీంనగర్‌‌ కలెక్టర్‌‌ పమేలా సత్పతి, రాజన్న సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్‌‌ ఝా, ఎస్పీ అఖిలేశ్‌‌ మహాజన్‌‌, హనుమకొండ కలెక్టర్‌‌ ప్రావీణ్య హాజరయ్యారు. అనంతరం ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యంతో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్‌‌ లోయర్ మానేర్ డ్యాం, నారాయణపూర్‌‌ రిజర్వాయర్‌‌ను సందర్శించారు. ఎల్లంపల్లి నుంచి రోజువారీగా ఇప్పటికే నీరు విడుదల చేస్తున్నట్లు తెలిపారు. నారాయణపూర్‌‌ రిజర్వాయర్‌‌తో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు శాశ్వత పరిష్కారం చేపడతామన్నారు. 

================================================================