
సిద్దిపేట, వెలుగు: స్థానిక ఎన్నికల్లో ప్రభుత్వ పథకాలను విస్తృతంగా ప్రచారం చేసి ఉమ్మడి మెదక్ జిల్లాలో కాంగ్రెస్ జెండా ఎగిరేలా కృషి చేయాలని పీసీసీ మెదక్ జిల్లా ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. సోమవారం గాంధీ భవన్లో ఉమ్మడి మెదక్ జిల్లా ముఖ్య నేతల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. పార్టీలో కష్టపడిన వారికే పదవులు వస్తాయని, పెండింగ్ లో ఉన్న నామినేటెడ్ పోస్టులను ఈ నెలాఖరులోగా భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. స్థానిక ఎన్నికల్లో బీసీల కు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నందున కొత్త నాయకత్వానికి అవకాశాలు వస్తాయన్నారు.
సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల కోసం ఇప్పటి నుంచే పని చేయాలని సూచించారు. సమావేశంలో నీలం మధు, సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షులు తూంకుంట నర్సారెడ్డి, ఆంజనేయులు గౌడ్, పార్లమెంట్ ఇన్చార్జి ఉపాధ్యక్షుడు బండి రమేశ్, నవాబ్ ముజాహిద్ ఆలం ఖాన్, జనరల్ సెక్రటరీలు జగదీశ్వర్ గౌడ్, ధారాసింగ్, ఉప్పల్ శ్రీనివాస్ గుప్తా, నందిమల్ల యాదయ్య, చనగాని దయాకర్, అసదుద్దీన్, అబ్జర్వర్లు మెట్టు సాయి కుమార్, పవన్ మల్లాది పాల్గొన్నారు.