
సీఎం కేసీఆర్ ఏది చెప్పినా రైతుల మంచి కోసం మాత్రమే చెబుతారని , బలమైన కారణం ఉంటేనే ఏదైనా చెబుతారని మంత్రి ప్రశాంత్ రెడ్డి. రైతులను అప్పుల ఊబి నుంచి బయటకు తేవాలని రైతుబంధు ప్రారంభించారని, తాజాగా సమగ్ర వ్యవసాయి విధానం కూడా రైతుల బాగుకోసమేనని అన్నారు. దీనిపై ప్రతిపక్షాలు అనవసర విమర్శలు చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం ఎల్లంపేట్ గ్రామంలో ఏర్పాటు చేసిన రైతు అవగాహన సదస్సు కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి … కేసీఆర్ నిర్ణయాన్ని సమర్థిస్తూ తీర్మానాలు చేసిన గ్రామాల రైతులకు ధన్యవాదాలు తెలిపారు. ఉమ్మడి నిజామాబాద్ లో అన్ని గ్రామాల్లో ఈ స్ఫూర్తి వస్తుందని ఆశిస్తున్నానన్నారు.
రాష్ట్రంలో కరోనా ఇబ్బందులు ఉన్నా 12 వందల కోట్ల రైతు రుణాలు మాఫీ చేశారని, 7 వేల కోట్ల రూపాయలు రైతుల కోసం ప్రత్యేకంగా కేటాయించారని చెప్పారు. 3 సంవత్సరాల కాలంలో 6 వందల మీటర్ల ఎత్తుకు రివర్స్ పంపింగ్ ద్వారా కాళేశ్వరం ప్రాజెక్టు తీసుకువచ్చిన ఘటన ముఖ్యమంత్రి కేసీఆర్ కె దక్కుతుందన్నారు. 22 వేల కోట్లు భగీరథ కోసం, 14 వేల కోట్లు రైతులకు పెట్టుబడి సాయం కోసం, 80 వేల కోట్లు కాళేశ్వరం పథకానికి ఖర్చు చేశారని చెప్పారు. రైతులకు సకాలంలో ఎరువులు అందుబాటులో ఉంచారన్నారు. వీటన్నిటి ద్వారా పంట విస్తీర్ణం పెరుగుతుందని, పంట విస్తీర్ణం పెరిగితే రైతుకు గిట్టుబాటు ధర రావాలని కేసీఆర్ భావించారన్నారు. అందుకే లాభసాటి వ్యవసాయ పద్ధతికి శ్రీకారం చుట్టారని చెప్పారు మంత్రి ప్రశాంత్.
దేశంలో తెలంగాణలో తప్ప ఎక్కడ కూడా 100 శాతం ధాన్యం కొనుగోలు చేసిన రాష్ట్రాలు లేవని చెప్పారు. రానున్న రోజుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ధాన్యం కొనే ఆర్థిక పరిస్థితి ఉండకపోవచ్చనని, అలాంటి పరిస్థితిలో రైతులు ప్రభుత్వాల వైపు చూడకుండా నేరుగా రైతులే ధాన్యం విక్రయించుకునేలా చేయడమే లాభసాటి వ్యవసాయ విధాన ఉద్దేశ్యమని చెప్పారు. ఇకపై 3 నెలల ముందే ఏ పంట వేయాలనేది రైతులకు తెలియజేస్తామని, వారికి వ్యవసాయ కార్డులు ఇవ్వడం జరుగుతుందని చెప్పారు.
ఏ పంట వేస్తే రైతులకు లాభం చేకూరుతుందో సీఎం చెప్పడం తప్పా అని ప్రతిపక్షాలను ప్రశ్నించారు మంత్రి. “చేసే ముఖాలు మీకు ఎలాగూ లేకపోయే.. ఇలాంటి గొప్ప పనులను విమర్శించే మిమ్మల్ని ఏమనాలి..? గత 50 ఏళ్ల పాలనలో ఇలాంటి మంచి పనులు ఎప్పుడైనా చేసారా..? చేసాము అని చెప్పుకునే మొఖం ఉందా మీకు..? మార్కెట్లలో ధాన్యం కొనండి అని రైతులు అడ్డుకునే పరిస్థితి మీ హయాంలో ఉండేది. ఏ మంచి పనులు చేసినా విమర్శలు చేయడం ప్రతిపక్షాలకు అలవాటైపోయింది. ఆరేళ్ళ కాలంలో కేసీఆర్ ఏం చేసినా రైతులకు మంచే జరిగింది తప్ప చెడు జరగలేదు.”అని ప్రతిపక్షాలపై మండిపడ్డారు.
తెలంగాణకు ఎన్ని సమస్యలు ఎదురైనా ఎదురొడ్డి నిలబడే ఏకైక నాయకుడు సీఎం కేసీఆర్ అని, కేసీఆర్ అంటే తెలంగాణ ఆత్మకు ప్రతిరూపం అని మంత్రి అన్నారు.