పైసలిచ్చి పదవులు తెచ్చుకున్నోళ్లు ఎగిరెగిరి పడుతున్రు

పైసలిచ్చి పదవులు తెచ్చుకున్నోళ్లు ఎగిరెగిరి పడుతున్రు
  • మంత్రి పువ్వాడ అజయ్ కుమార్

ఖమ్మం, వెలుగు: పైసలిచ్చి పదవులు తెచ్చుకున్నవాళ్లు ఎగిరెగిరి పడుతున్నారని, వాళ్లకు తగిన రీతిలో సమాధానం చెప్పే చాన్స్​ఉన్నా తమ పార్టీ నేతలు, కార్యకర్తలు సంయమనం పాటిస్తున్నారని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ఖమ్మం జిల్లా టీఆర్ఎస్ ఆఫీస్​లో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. కార్పొరేటర్ నుంచి ఎంపీ అయిన ఓ పెద్దాయన గతంలో ఖమ్మం వచ్చి ఏవేవో మాట్లాడి వెళ్లిపోయాడని, తాను వ్యాక్సిన్​ ఇచ్చిన తర్వాత మళ్లీ ఇటు వైపు చూడడం మానేశాడని సెటైర్​ వేశారు.

ప్రతిపక్షాలకు హుందాతనం ఉండాలి తప్ప, ఇష్టం వచ్చినట్టు మాట్లాడొద్దని హితవు పలికారు. కొందరు రాజన్న రాజ్యం తెస్తామంటూ తిరుగుతున్నారని.. ‘రైతుల ఆత్మహత్యలు, బయ్యారం గనుల దోపిడీ, జలయజ్ఞం పేరుతో ధనయజ్ఞం, వ్యవసాయానికి 6 గంటల కరెంట్, రూ.200 పెన్షనా’ రాజన్న రాజ్యం అంటే అని ప్రశ్నించారు. వందల మంది ప్రాణ త్యాగాలతో సాధించుకున్న ప్రత్యేక రాష్ట్రాన్ని మళ్లీ పరాయి రాష్ట్రానికి చెందిన వాళ్లకు అప్పగిస్తామా.. అంటూ అడిగారు. అలాంటి వాళ్లను ఎక్కడ ఉంచాలో రాష్ట్ర ప్రజలకు తెలుసని అన్నారు.