
- మెడికల్ కాలేజీ అభివృద్ధి పనులకు 40 కోట్ల మంజూరుకు కృషి: మంత్రి రాజనర్సింహ
జగిత్యాల, వెలుగు: జగిత్యాల జిల్లాలో మూడు ట్రామా కేర్ సెంటర్లు ఏర్పాటు చేస్తామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నర్సింహ తెలిపారు. శనివారం రాత్రి జగిత్యాల జిల్లా ధర్మపురికి చేరుకున్న మంత్రి.. ఆదివారం ఉదయం లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. వైద్య ఆరోగ్యశాఖ లో ఉన్న సమస్యలను పరిష్కరించడంతో పాటు శాఖలో ఖాళీలను భర్తీ చేస్తామని అన్నారు. ధర్మపురి నుంచి నేరుగా జగిత్యాల చేరుకున్న మంత్రి.. కలెక్టరేట్ లో వైద్య ఆరోగ్య శాఖ రివ్యూ మీటింగ్ లో పాల్గొన్నారు.
ఈ సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో ఉన్న ఖాళీలు, జనరల్ ఆస్పత్రి, ఎంసీహెచ్, మెడికల్ కాలేజీ, నర్సింగ్ కళాశాల సమస్యలతో పాటు ఇన్ కంప్లీట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంశాలపై చర్చించారు. జగిత్యాలలో త్వరలోనే ట్రామా సెంటర్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. పెండింగ్ లో ఉన్న మెడికల్ కాలేజీ అభివృద్ధి పనులకు రూ.40 కోట్లు నిధులు మంజూరు చే స్తామని ప్రకటించారు. ఈ సమీక్ష సమావేశం లో ప్రభుత్వ విప్లు అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఆది శ్రీనివాస్, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, కలెక్టర్ సత్య ప్రసాద్, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పాల్గొన్నారు.
కలెక్టరేట్లో రివ్యూ మీటింగ్ అనంతరం మంత్రి దామోదర రాజనర్సింహ నేరుగా మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఇంటికి వెళ్లి మర్యాద పూర్వకంగా కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. వైద్య విధాన పరిషత్ లో రూ.6.90 కోట్ల నిధుల అవకతవకల విషయంలో విచారణ జరిపిస్తామని చెప్పారు. ఎమ్మెల్యే సంజయ్ కుమార్, మాజీ మంత్రి జీవన్ రెడ్డి మధ్య ఉన్న వివాదాల గురించి మీడియా అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో సీనియర్ లీడర్ అని, ఆయనకు పార్టీలో తగిన గౌరవం ఉంటుందన్నారు.