
హైదరాబాద్, వెలుగు: మన ఊరు–- మన బడి కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలోని 26 వేల స్కూళ్ల రూపురేఖలు మారుస్తామని మంత్రులు హరీశ్‌రావు, సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ఈ కార్యక్రమం అమలుపై శనివారం రంగారెడ్డి కలెక్టరేట్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రూ.7,289.54 కోట్లతో మూడు దశల్లో 26 వేల స్కూళ్లను అభివృద్ధి చేస్తామన్నారు. మొదటి దశలో 9,123 స్కూళ్లను ఎంపిక చేస్తామని తెలిపారు. ఆయా స్కూళ్లలో 12 అంశాలతో అభివృద్ధి పనులు చేపట్టాలని సూచించారు. జిల్లా మంత్రుల ఆధ్వర్యంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీ చైర్మన్‌లు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, లైబ్రరీ చైర్మన్‌లు, స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీలతో సమావేశాలు నిర్వహించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో భాగంగా చేపట్టే అభివృద్ధి పనులకు నిధుల కొరత ఉండదని, ప్రత్యేకంగా బ్యాంకు ఖాతాలు తెరిచి నిధులు ఖర్చు చేయాలని సూచించారు. దీనికి సంబంధించిన ప్రక్రియ 15 రోజుల్లోగా పూర్తిచేయాలన్నారు.
‘మన ఊరు- మన బడి’కి సాయం చేయండి
‘మన ఊరు – మన బడి’ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని ఎన్‌ఆర్‌ఐలకు మంత్రులు కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి పిలుపునిచ్చారు. శనివారం బేగంగపేట క్యాంపు ఆఫీస్ నుంచి ఎన్‌ఆర్‌ఐలతో వర్చువల్‌గా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ.. లక్షలాది మంది స్టూడెంట్స్‌కు అత్యుత్తమ సౌకర్యాలతో చదువు అందిస్తున్నామని, గురుకుల విద్యార్థులు గొప్ప విజయాలు సాధిస్తున్నారన్నారు. ప్రభుత్వ స్కూళ్లను బలోపేతం చేసేందుకు ‘మన ఊరు– మన బడి’ చేపట్టినట్టు తెలిపారు. రాష్ట్రం నుంచి ఇతర దేశాలకు వెళ్లి ఉన్నత స్థితిలో ఉన్న వాళ్లు స్కూళ్ల అభివృద్ధిలో పాలుపంచుకోవాలని కోరారు. కోటి, అంతకుమించి ఆర్థిక సాయం చేస్తే.. వారు సూచించిన వారి పేరును ఆ స్కూలుకు పెడతామని, రూ.10 లక్షలు, అంతకన్నా ఎక్కువ సాయం చేసే వారు సూచించిన పేరును క్లాస్ రూమ్‌కు పెడుతామని చెప్పారు. స్కూళ్ల బలోపేతానికి ముందుకొచ్చే వారిని నుంచి డొనేషన్లు తీసుకునేందుకు ప్రత్యేక వెబ్‌సైట్ రూపొందిస్తున్నామన్నారు.