
- ‘ వీ6 వెలుగు’ కథనంపై స్పందించి హామీ ఇచ్చిన మంత్రి సీతక్క
- అడవిలోంచి గ్రామానికి వెళ్లిన ముంపు కుటుంబాలు
ఏటూరునాగారం,వెలుగు: ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం కొండాయి వరద ముంపు బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని పంచాయతీరాజ్, స్త్రీ,శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క హామీ ఇచ్చారు. కొండాయి గ్రామానికి చెందిన ముంపు బాధిత 28 కుటుంబాలు దొడ్ల గ్రామ శివారు అడవిలోకి గుడిసెలు వేసుకుని ఉంటున్నారు. వీరిపై ‘ వరద భయంతో వలస’ స్టోరీ మంగళవారం వీ6 వెలుగు పత్రికలో ప్రచురితమైంది. స్పందించిన మంత్రి సీతక్క ఆదేశించడంతో రెవిన్యూ, మండల పరిషత్, ఫారెస్ట్ అధికారులు, మండల కాంగ్రెస్ నేతలు వెళ్లి బాధితుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం వారు మాట్లాడుతూ.. బాధితులకు ఇంటి స్థలాలు కేటాయించేందుకు అధికారులతో మాట్లాడి ప్రభుత్వ స్థలం లేకుంటే ఆర్వోఎఫ్ఆర్ పట్టా కలిగిన భూములనైన కొనుగోలు చేసి ఇంటి స్థలాలకు కేటాయిస్తామని మంత్రి హామీ ఇచ్చారన్నారు. దొడ్ల గ్రామంలో 35 నుంచి 40 వరకు ఇండ్లు దెబ్బతిన్నాయని, వారికి కూడా స్థలాలు కేటాయించేందుకు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని చెప్పారన్నారు. అధికారులు, నేతల భరోసాతో కొండాయిలోని తమ ఇండ్లకు వెళ్లిపోవడానికి బాధితులు అంగీకరించడంతో దగ్గరుండి జంపన్నవాగు దాటించి కొండాయికి పంపారు. తహసీల్దార్ జగదీశ్వర్, ఎంపీడీవో శ్రీనివాస్, ఎఫ్డీఆర్వో నరేందర్ , కాంగ్రెస్జిల్లా ఉపాధ్యక్షుడు ఎండీ. ఖలీల్ ఖాన్, మండల ప్రధాన కార్యదర్శి వావిలాల ఎల్లయ్య తదితరులు ఉన్నారు.