గ్రామాల్లో నీటి వనరుల పెంపునకు రూ.150 కోట్లతోప్రత్యేక ప్రణాళికలు

గ్రామాల్లో నీటి వనరుల పెంపునకు రూ.150 కోట్లతోప్రత్యేక ప్రణాళికలు
  •      జిల్లా పర్యటనలో మంత్రి సీతక్క  
  •     వర్షాలకు కొట్టుకుపోయిన జంపన్న  వాగు బ్రిడ్జి పనులు ప్రారంభం.. 

ములుగు, వెలుగు :  గ్రామాల్లో నీటి వనరులను పెంచేందుకు రూ .150కోట్లతో ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేశామని మంత్రి సీతక్క అన్నారు. ములుగు జిల్లాలో శనివారం ఆమె విస్తృతంగా పర్యటించారు. ఆయా గ్రామాల్లో శంకుస్థానలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ములుగు యోజకవర్గాన్ని  అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తానని, పీఆర్​ శాఖ ద్వారా రూ.182కోట్ల నిధులతో అభివృద్ధి పనులు ప్రారంభించామని  మంత్రి సీతక్క  అన్నారు.  శనివారం ములుగు జిల్లాలోని ములుగు, వెంకటాపూర్, గోవిందరావుపేట, ఏటూరునాగారం

మంగపేట మండలాల్లో విస్తృతంగా పర్యటించిన మంత్రి పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు.   జిల్లా కేంద్రంతోపాటు మండలంలోని జగ్గన్నపేట, కాశిందేవిపేట, జంగాలపల్లి, ఇంచర్ల గ్రామాల్లో సీసీ రోడ్లు, కమ్యూనిటీ హాల్​  అభివృద్ధి పనులు చేపట్టారు. అనంతరం కలెక్టరేట్​లో కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్​ చెక్కులు పంపిణీ చేశారు.  నియోజకవర్గంలో రోడ్లు సరిగా లేకపోవడంతో రూ.15కోట్లతో సీసీ రోడ్లు ప్రారంభించామన్నారు.    ఈ కార్యక్రమాల్లో కలెక్టర్​ ఇలా త్రిపాఠి, ఎస్పీ డాక్టర్​ శబరీష్​, అడిషనల్​  కలెక్టర్​ శ్రీజ, మహేందర్​ జీ, ఆర్డీవో సత్యపాల్​ రెడ్డి, ఎంపీపీ గండ్రకోట శ్రీదేవీ సుధీర్​, జిల్లా సంక్షేమాధికారి జే.ఎం.స్వర్ణలత, జిల్లా మైనారిటీ శాఖ అధికారి ప్రేమలత పాల్గొన్నారు. 

వెంకటాపూర్ (రామప్ప) : మండలంలోని  లక్ష్మీదేవి పేట బూరుగుపేట గ్రామాల మధ్య బోదర వాగుపై  బ్రిడ్జి నిర్మాణ పనులకు  మంత్రి సీతక్క శంకుస్థాపన చేశారు.  అనంతరం లక్ష్మీదేవి పేట గ్రామంలో ఐదు లక్షలతో ఎల్లమ్మ గుడి కాంపౌండ్ వాల్ పనులకు శంకుస్థాపన చేశారు.

ఏటూరునాగారం : మండలంలోని దొడ్ల, -కొండాయి గ్రామాల మధ్య జంపన్నవాగుపై రూ. 9.50 కోట్ల రూపాయల తో బ్రిడ్జి నిర్మాణ పనులకు  సీతక్క శంకుస్థాపన చేశారు.   ఏటూరునాగారం మండలంలో పర్యటించిన సీతక్క చిన్నబోయినపల్లిలోని మసీద్ కాంపౌండ్ వాల్ నిర్మాణ పనులను రూ. 5 లక్షలతో  ప్రారంభించారు.  ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్​, బ్లాక్ అద్యక్షుడు ఇర్సవడ్ల వెంకన్న, మండల అధ్యక్షుడు చిటమట రఘు, పీఏసీఎస్​ డైరెక్టర్​ చెన్నూరి బాలరాజు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

తీరనున్న కొండాయి, మల్యాల, ఐలాపురం గ్రామాల ప్రజల కష్టాలు..

గతంలో దొడ్ల , కొండాయి గ్రామాల మధ్య జంపన్న వాగుపై   వంతెన   ఏడాది కురిసిన భారీ వర్షాలకు కూలిపోయింది. దీంతో వాగుకు అవతలి వైపు ఉన్న కొండాయి, మల్యాల, కొత్తూరు, ఐలాపురం గ్రామలకు వాహన రాకపోకలు పూర్తిగా నిలిచి పోయాయి. వరదల సమయంలో రోగాల భారిన పడిన ప్రజలు వైద్యం కోసం  మండల కేంద్రానికి రాలేక తీవ్ర ఇబ్బందులు పడ్డారు.  ఈ సమస్య  స్వయంగా  సమీక్షించిన సీతక్క రాకపోకల పునరుద్దరణ కోసం  పనులు ప్రారంభించారు. ఈ వంతెన నిర్మాణం పూర్తయితే ఆయా గ్రామాల ప్రజలతో పాటు మేడారం మహా జాతరకు కొండాయి మీదుగా వెళ్లే భక్తుల కష్టాలు సైతం తీరనున్నాయి.

తాడ్వాయి :  ఛత్తీస్​గఢ్​   నుంచి  వచ్చి ములుగు జిల్లా లోని తాడ్వాయి, ఏటూరు నాగారం, కన్నాయిగూడెం మంగపేట,వెంకటాపురం.పసర గ్రామాలలో గల నివాసముంటున్న గొత్తి కోయలకు  మంత్రి   సీతక్క    లైట్స్ పంపిణీ చేశారు.   గూడెంలలో  కరెంటు, తాగునీరు సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తానని  మంత్రి తెలిపారు.