
- సాగునీటిపారుదల శాఖ మంత్రిని కోరిన మంత్రి సీతక్క, ఎమ్మెల్యేలు.
ఏటూరునాగారం, వెలుగు: ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం లక్ష్మీపురంలోని గోదావరి వద్ద ఏర్పాటుచేసిన దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా ములుగు జిల్లాకు పూర్తి స్థాయిలో సాగునీరు అందించి సస్యశ్యామలం చేయాలని సాగునీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని మంత్రి సీతక్క కోరారు.
ఆదివారం కన్నాయిగూడెం మండలంలోని తుపాకులగూడెం వద్ద సమ్మక్క బ్యారేజ్, దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ ఇంటెక్వెల్, పంపు హౌజ్‌ను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ధనసరి అనసూయ సీతక్క, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, వాకిటి శ్రీహరి, ఎంపీ బల్‌రాంనాయక్, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, గండ్ర సత్యనారాయణ, నాగరాజు, మురళీ నాయక్ తో కలిసి పరిశీలించారు.
అనంతరం దేవాదుల ఎత్తిపోతల పురోగతిపై అధికారులతో సమీక్షించారు. దేవాదుల ప్రాజెక్ట్ కు సంబంధించిన వివిధ దశలు, ఇప్పటి వరకూ పూర్తయిన పనులు, భూసేకరణ, తదితర అంశాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సాగునీటిపారుదల శాఖ సీఈ వెంకటేశ్వర్లు వివరించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క దేవాదుల ప్రాజెక్ట్ పై ఇక్కడ సమీక్ష నిర్వహించడం రెండోసారి అని అన్నారు.
పక్కనే గోదావరి ఉన్నా కన్నాయీగూడెం ప్రాంతంలో సాగునీరు అందడం లేదన్నారు. దేవాదుల ద్వారా రామప్ప చెరువు నిండితే ములుగు లోని పలు ప్రాంతాలు ముంపునకు గురవుతాయన్నారు. తుపాకులగూడెం బ్యారేజ్, దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ నిర్మాణం కోసం భూమి కోల్పోయిన రైతులకు మానవీయ కోణంలో ఆలోచించి తగినంత పరిహారం అందించాలన్నారు.
మంగపేట, కన్నాయిగూడెం, ఏటూరునాగారంలలో కెనాల్స్ పై ఏర్పాటు చేసిన లిఫ్టులు సరిగా పనిచేయక తాగునీరు అందడం లేదన్నారు. పాకాల ద్వారా నర్సంపేటకు నీరందిస్తూ కొత్తగూడెం కూడా సాగునీరు అందించేలా ప్రణాళిక చేయాలని కోరారు. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ మాట్లాడుతూ భీం ఘన్ పూర్ రిజర్వాయర్ కు సాగునీరు వచ్చేట్టు చర్యలు చేపట్టాలన్నారు.
వర్దన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు మాట్లాడుతూ వర్ధన్నపేట నియోజకవర్గం పరిధిలో ఉన్న ఆఖరు ఆయకట్టుకు దేవాదుల నీరు అందించాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ని కోరారు. అనంతరం దేవాదుల పంపు హౌజ్ వద్ద మల్లంపల్లి మండలం కొడిశల కుంటలో రూ. 2.7కోట్లతో చేపట్టిన విద్యుత్ ఉప కేంద్రం శిలా ఫలకాన్ని, ములుగు మండలంలోని గట్టమ్మ, బండారుపల్లి, జగ్గన్నపేట, లింగాల, నార్లపూర్, రొయ్యురు, బుచ్చంపేటలో రూ. 20.73 కోట్ల వ్యయంతో నిర్మించే విద్యుత్ ఉప కేంద్రాలకు శంకుస్థాపన చేశారు.
ములుగు కలెక్టర్ దివాకర టీ.ఎస్, ములుగు ఇన్చార్జి, భూపాలపల్లి ఎస్పీ కిరణ్ కారే, హనుమకొండ, వరంగల్ జిల్లాల అడిషనల్కలెక్టర్లు వెంకట్ రెడ్డి, సంధ్యారాణి, ఆర్డీవో లు సత్యపాల్ రెడ్డి, వెంకటేశ్, ఇరిగేషన్ అధికారులు పాల్గొన్నారు.