విత్తన భాండాగారంగా తెలంగాణను తీర్చిదిద్దాలె : మంత్రి నిరంజన్ రెడ్డి 

విత్తన భాండాగారంగా తెలంగాణను తీర్చిదిద్దాలె : మంత్రి నిరంజన్ రెడ్డి 

రంగారెడ్డి జిల్లా : ప్రపంచానికే విత్తన భాండాగారంగా తెలంగాణను తీర్చిదిద్దడానికి కృషి చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పిలుపునిచ్చారు. ఇప్పటికీ రాష్ట్రం కొన్ని రకాల విత్తనాలను దిగుమతి చేసుకుంటోందని, భవిష్యత్తులో దీన్ని అధిగమించాలన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం రాజేంద్రనగర్ లో నిర్వహించిన "విత్తన మేళా - 2023" ని ఆయన ప్రారంభించారు. కొంతమంది రైతులకు విత్తనాలు అందించారు. 

రాష్ట్రం ఏర్పాటైనప్పటి నుంచి తెలంగాణ ప్రభుత్వం రైతాంగ సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలను అమలు చేస్తోందని మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి చెప్పారు. సాగునీటి వసతి పెద్ద స్థాయిలో కల్పిస్తున్నామన్నారు. ఇప్పుడు తెలంగాణ అంతట నీళ్ళే కనపడుతున్నాయన్నారు. తెలంగాణ ప్రాంతం విత్తనోత్పత్తికి చాలా అనుకూలమైందని, రైతాంగం ఈ విషయంపై దృష్టి పెట్టాలని కోరారు. తెలంగాణలో తయారయ్యే విత్తనాలకు ఇతర ప్రాంతాల్లో విపరీతమైన ఆదరణ ఉందన్నారు. భవిష్యత్తులో తెలంగాణ ప్రపంచానికి విత్తనాలు సరఫరా చేసే స్థాయికి చేరుకోవాలని నిరంజన్ రెడ్డి సూచించారు. 

పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా భూ వనరులు పెరగవన్న విషయాన్ని రైతులందరూ గుర్తుంచుకోవాలన్నారు మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. పరిమిత భూ వనరుల్లోనే టెక్నాలజీని  వినియోగించి, భూసారాన్ని పరిరక్షిస్తూనే అధిక ఉత్పత్తి, ఉత్పాదకతలను సాధించాలన్నారు. రసాయనిక ఎరువులు, క్రిమిసంహారకాల వినియోగాన్ని తగ్గించి.. భూసారాన్ని పరిరక్షించాలని మంత్రి సూచించారు. ఈ విషయాలపై శాస్త్రవేత్తలు రైతులకు నిరంతరం అవగాహన కల్పించాలన్నారు. పశుపోషణకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆహార శుద్ధి పరిశ్రమలకు అధిక ప్రాధాన్యమిస్తూ.. ప్రత్యేక ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ ల ఏర్పాటు చేయడానికి అన్ని చర్యలు చేపట్టిందని మంత్రి నిరంజన్ రెడ్డి వివరించారు. 

విత్తన మేళాలో PJTSAUతో పాటు ICAR, అనేక జాతీయ, రాష్ట్రస్థాయి సంస్థలు, వ్యవసాయ అనుబంధ విశ్వవిద్యాలయాలు స్టాల్స్ ను ఏర్పాటు చేశాయి. రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు. ప్రదర్శనలను తిలకించి విత్తనాలు కొనుగోలు చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర విత్తన సంస్థ కార్పొరేషన్ చైర్మన్ కొండ బాల కోటేశ్వర రావు, ఎమ్మెల్సీ సురభి వాణిదేవి, వ్యవసాయ శాఖ ప్రత్యేక కమిషనర్ K. హనుమంతు, IAS, PJTSAU రిజిస్ట్రార్ ప్రొఫెసర్ సుధీర్ కుమార్, పరిశోధనా సంచాలకులు డాక్టర్ ఎం. వెంకటరమణ, విస్తరణ సంచాలకులు డాక్టర్ సుధారాణి, విత్తన సంచాలకులు డాక్టర్ పి. జగన్ మోహన్ రావు, శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ వంగడాలపై విశ్వవిద్యాలయం రూపొందించిన అనేక కరపత్రాలను మంత్రి విడుదల చేశారు.