
- అక్కసుతోనే అబద్ధాలు
- కేన్స్ ఎక్కడికీ పోలేదు..
- రాష్ట్రం నుంచి ఏ కంపెనీ వెళ్లదు
- దావోస్ పర్యటనతో రూ.9 వేల కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయని వెల్లడి
హైదరాబాద్, వెలుగు: ఎంపీ ఎన్నికల్లో సీట్లు రావనే అక్కసుతోనే తమ ప్రభుత్వంపై బీఆర్ఎస్, బీజేపీ నేతలు అబద్ధాలు, తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఐటీ, ఇండస్ట్రీస్ శాఖ మంత్రి శ్రీధర్ బాబు మండిపడ్డారు. ప్రతిపక్షాల విమర్శలకు తమ పనితీరే నిదర్శనమని ఆయన స్పష్టం చేశారు. ఆదివారం శ్రీధర్‌బాబు గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడారు.
పదేండ్లలో జరిగిన తప్పులను 3 నెలల నుంచి సెట్ చేస్తున్నామని, ఇంతలోనే ఎంపీ ఎలక్షన్ కోడ్ వచ్చిందని తెలిపారు. మార్పునకు అడ్డు వస్తే సహించేది లేదని, ప్రజల సంక్షేమమే తమకు ముఖ్యమని అన్నారు. అబద్ధాలు ప్రచారం చేస్తే బీఆర్ఎస్ పార్టీ కనుమరుగవుతుందని హెచ్చరించారు. తమ సర్కారు ప్రజలకు ఇస్తున్న పథకాలను కేసీఆర్, కేటీఆర్, హరీశ్పక్కదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. ముఖ్యంగా పవర్ , సివిల్ సప్లై, ఇరిగేషన్, ఇండస్ట్రీస్‌పై అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు.
కరెంట్‌పై ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నరు
కరెంట్ పై ప్రజలను బీఆర్ఎస్ నేతలు తప్పుదోవ పట్టిస్తున్నారని మంత్రి శ్రీధర్‌బాబు మండిపడ్డారు. నిరుడు బీఆర్ఎస్ పాలనలో వందలసార్లు కరెంట్ కోతలు ఏర్పడి, వరంగల్ఎంజీఎం దవాఖానలో పేషెంట్లు ఇబ్బంది పడ్డారని చెప్పారు. అదే దవాఖానలో రోగిని ఎలుకలు కొరికిన సంఘటనలు కూడా చోటుచేసుకున్నాయని తెలిపారు.
కానీ ఇటీవల జనరేటర్ఆన్ కాకపోతే రోగులు ఇబ్బంది పడుతున్నారంటూ ఆ పార్టీ పత్రిక లో వార్తలు రాయించారని ఫైర్ అయ్యారు. భువనగిరిలో11 కేవీ ఫీడర్ ట్రిప్ అయితే 30 నిమిషాల్లో అధికారులు సెట్ చేశారని చెప్పారు. సూర్యాపేట బస్ యాత్రలో అక్కడ కరెంట్ కనెక్షన్ తీసుకోలేదని, జనరేటర్ పెట్టి అది ఆఫ్ చేసి కరెంట్ పోయిందని బీఆర్ఎస్ నేతలు తమ ప్రభుత్వాన్ని బద్నాం చేశారని మండిపడ్డారు. కొన్ని సార్లు ప్రభుత్వ పరిధిలో లేకుండా ప్రకృతి వైపరీత్యాలతో పొరపాట్లు జరుగుతాయని, వాటికి విద్యుత్‌శాఖను బద్నాం చేయొద్దని సూచించారు.
కంపెనీలు ఎక్కడికీ పోవట్లే
రాష్ట్రం నుంచి కంపెనీలు ఎక్కడికీ పోవట్లేదని మంత్రి శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు. దావోస్ సమ్మిట్ ద్వారా రాష్ట్రానికి రూ. 9వేల కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయని వెల్లడించారు. కేన్స్ కంపెనీతో అక్టోబర్ 2023 లో ఒప్పందం జరిగిందని, కేంద్రం నుంచి ఈ కంపెనీకి సబ్సిడీ రావాల్సి ఉందని చెప్పారు. అందుకోసం ఆ కంపెనీ వెయిట్ చేస్తుంటే.. ఈ కంపెనీ వెళ్లిపోయిందని కేటీఆర్దుష్ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. 2016 నుంచి చిన్న పరిశ్రమలకు రూ.3వేల కోట్ల సబ్సిడీ ఇవ్వలేదని అన్నారు.
ఏలేటికి ఇపుడు సోయి వచ్చిందా?: జీవన్ రెడ్డి
‘‘బీజేపీ ఫ్లోర్ లీడర్ మహేశ్వర్ రెడ్డికి ఇప్పుడు సోయి వచ్చిందా? గత పదేండ్లలో బీఆర్ఎస్ చేసిన తప్పులు కనిపించడం లేదా?’’ అని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ప్రశ్నించారు. పేపర్లో పేరువస్తే చాలని మహేశ్వర్‌రెడ్డి అనుకొని, నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నారని అన్నారు. ఎక్కువ మాట్లాడితే పెద్ద లీడర్ అవ్వరని, వాస్తవాలు మాట్లాడితేనే అవుతారని చెప్పారు. సివిల్ సప్లై డిపార్ట్మెంట్ ఇంత అప్పుల్లోకి పోవడానికి కేంద్రమే కారణం కాదా? అని ప్రశ్నించారు.
మంత్రులతో ఎంపీ విజయేంద్ర ప్రసాద్ భేటీ
గాంధీ భవన్ లో మంత్రులు శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డితో ఎంపీ విజయేంద్ర ప్రసాద్ ( దర్శకుడు రాజమౌళి తండ్రి ) భేటీ అయ్యారు. ఈ భేటీకి, రాజకీయాలకు సంబంధం లేదని విజయేంద్ర ప్రసాద్ తెలిపారు. పేపర్ లీకేజ్ కాకుండా, చేనేత పరిశ్రమకు ఇండస్ట్రీస్ డిపార్ట్ మెంట్ చేయాల్సిన అంశాలపై మంత్రికి పలు సూచనలు చేశానని వెల్లడించారు.
పీసీసీ కొత్త చీఫ్‌పై చర్చ!
మంత్రులు శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, విప్ అడ్లూరి లక్ష్మణ్, ఎమ్మెల్యే సంజీవరెడ్డి, ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్ గౌడ్ గాంధీ భవన్ లో సుమారు అరగంటపాటు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పీసీసీ కొత్త చీఫ్ గురించి చర్చ జరిగినట్టు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.