మత్స్య శాఖను గత ప్రభుత్వంఏటీఎంలా వాడుకుంది : మంత్రి వాకిటి శ్రీహరి

మత్స్య శాఖను గత ప్రభుత్వంఏటీఎంలా వాడుకుంది : మంత్రి వాకిటి శ్రీహరి
  • లెక్కపెట్టలేరని తక్కువ చేప పిల్లలు వేసేవారు: మంత్రి వాకిటి శ్రీహరి 
  • తాము 80 నుంచి 110 ఎంఎంఉన్న చేప పిల్లలు పంపిణీ చేస్తామని వెల్లడి

కరీంనగర్, వెలుగు: మత్స్య శాఖను గతంలో బీఆర్ఎస్ నేతలు ఏటీఎంలా వాడుకున్నారని మత్స్య, పశుసంవర్ధక, స్పోర్ట్స్ శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. చేప పిల్లలను లెక్కపెట్టలేరని తక్కువ సంఖ్యలో వాటిని పంపిణీ చేశారని ఆరోపించారు. చేప పిల్లల పంపిణీపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. సోమవారం కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మంత్రి పొన్నం ప్రభాకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో కలిసి ఆయన పలు అభివృద్ధి పనులు ప్రారంభించారు. కరీంనగర్ ఉజ్వల పార్క్ సమీపంలో చేప పిల్లల పెంపకాన్ని పరిశీలించారు. 

ఈ సందర్భంగా మంత్రి శ్రీహరి మాట్లాడుతూ.. రాష్ట్రంలో 87 కోట్ల చేప పిల్లలు పెంచేలా చెరువులు, ప్రాజెక్టులు, కుంటలు ఉన్నాయని తెలిపారు. 80, 110 ఎంఎం సైజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉన్న చేప పిల్లలను తాము పంపిణీ చేస్తామని చెప్పారు. ఇందుకోసం సీఎం రేవంత్ రెడ్డి రూ.150 కోట్లు కేటాయించారని వెల్లడించారు. కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చేపల ఉత్పత్తి బాగుందని, ఇక్కడ కోల్డ్ స్టోరేజీ, ఐస్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేసి, మత్స్యకార్మికులకు అండగా ఉంటామన్నారు. తనకు ఇచ్చిన శాఖలన్నీ గందరగోళంగా ఉన్నాయని, ఇవన్నీ గత పదేండ్లలో ఆగమైనవేనన్నారు. ఇది తన అదృష్టమో దురదృష్టమో తెలియదని పేర్కొన్నారు. 

చేపల పెంపకంలో కరీంనగర్ ఫస్ట్: మంత్రి పొన్నం ప్రభాకర్​

గత పదేండ్లలో చేప పిల్లల పంపిణీ, కొనుగోలు, మత్స్య శాఖలో అవినీతి జరిగిందనే కారణంతో మొదటి సంవత్సరం చేప పిల్లల పంపిణీ కొంత ఆలస్యమైందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కరీంనగర్ జిల్లాలో లోయర్ మానేరు డ్యామ్, మిడ్ మానేరు, ఎల్లంపల్లి, అనేక గొలుసుకట్టు చెరువుల్లో పెద్ద ఎత్తున చేపలు పెంచుతున్నారని, ఇక్కడ నుంచి అనేక ప్రాంతాలకు వాటిని ఎగుమతి చేస్తామని చెప్పారు. చేప పిల్లల పెంపకంలో రాష్ట్రంలో కరీంనగర్ మొదటి స్థానంలో ఉందని తెలిపారు.