కేసీఆర్ మాటల్ని తప్పుగా ప్రచారం చేస్తున్రు

 కేసీఆర్ మాటల్ని తప్పుగా ప్రచారం చేస్తున్రు
  • ఆయన మాటల్ని తప్పుగా ప్రచారం చేస్తున్రు: మంత్రి కేటీఆర్
  •  ప్రతిపక్షాలవి చిల్లర మల్లర మాటలు.. 
  •  ‘పాలమూరు’కు జాతీయ హోదా ఇవ్వలే
  • దేశమంతటా దళితబంధు అమలు చేయాలని డిమాండ్

నాగర్​కర్నూల్, జడ్చర్ల, వెలుగు: రాజ్యాంగ సవరణ గురించి సీఎం కేసీఆర్ మాట్లాడితే .. ప్రతిపక్ష నేతలు చిల్లర మల్లర మాటలు మాట్లాడుతున్నారని మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. కేసీఆర్‌‌‌‌ను బద్నాం చేయాలని ఆయన మాటలను తప్పుగా చిత్రకరిస్తున్నారని మండిపడ్డారు. రాజ్యాంగాన్ని ఇప్పటికే 105 సార్లు సవరించారని, దీనికేం సమాధానం చెప్తారని ప్రశ్నించారు. రాజ్యాంగ సవరణ అంటే రాజ్యాంగాన్ని అవమానించినట్లా అని నిలదీశారు. అంబేద్కర్ మార్గంలో 14 ఏండ్ల పాటు తెలంగాణ ఉద్యమాన్ని నడిపించిన నిజమైన అంబేద్కర్‌‌‌‌వాది కేసీఆర్ అని చెప్పారు. కేంద్రానికి దళితులపై ప్రేమ ఉంటే దేశమంతటా దళితబంధును అమలు చేయాలని డిమాండ్ చేశారు. దేశంలోని అన్ని రాష్ట్రాలను సమానంగా చూడాల్సిన కేంద్రం.. తెలంగాణపై వివక్ష చూపుతోందని కేటీఆర్‌‌‌‌ ఆరోపించారు. సమతామూర్తి విగ్రహ ఆవిష్కరణకు వస్తున్న ప్రధాని నరేంద్ర మోడీకి రామానుజాచార్యులు కలలోకి వచ్చి సమదృష్టి కలిగేలా ఉపదేశం ఇవ్వాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. శుక్రవారం నాగర్‌‌‌‌కర్నూల్‌‌ జిల్లా తిమ్మాజీపేట మండల కేంద్రంలో ఎంజేఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రూ.3 కోట్లతో నిర్మించిన జెడ్పీ హైస్కూల్ బిల్డింగ్‌‌ను కేటీఆర్ ప్రారంభించారు. అంతకుముందు మహబూబ్‌‌నగర్ జిల్లా జడ్చర్ల మండలం కోడ్గల్‌‌లో నిర్మించిన 40 డబుల్ బెడ్రూం ఇండ్లను మంత్రులు నిరంజన్​రెడ్డి, శ్రీనివాస్‌‌గౌడ్‌‌తో కలిసి ప్రారంభించారు.

సంక్షోభంలోనూ సంక్షేమం ఆపలే

కరోనా సంక్షోభ టైంలోనూ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు ఆపలేదని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఒకప్పుడు వలసల జిల్లా అయిన పాలమూరులో ఇప్పుడు రివర్స్ వలసలు స్టార్ట్ అయ్యాయని చెప్పారు. మన ఊరు – మన బడి స్కీంకు సీఎం కేసీఆర్ రూ.7,300 కోట్ల నిధులు ప్రకటించారని అన్నారు. ఈ సందర్భంగా స్టూడెంట్లకు స్కూల్ బ్యాగ్స్ అందించిన మంత్రి.. వారితో కలిసి భోజనం చేశారు.

కేసీఆర్ జోలికి వస్తే అగ్నిగుండమే: శ్రీనివాస్‌‌గౌడ్‌‌

కేసీఆర్‌‌‌‌ను ముట్టుకుంటే దేశం అగ్నిగుండమేనని మంత్రి శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో దళిత బంధు అమలు చేస్తున్నామని తెలిపారు. ఈ పథకాలను దేశంలోని 23 రాష్ట్రాల్లో కూడా అమలు చేయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్‌‌‌‌పై లేనిపోని ఆరోపణలు చేసి ఇబ్బందులు పెట్టాలని చూస్తే సహించేది లేదన్నారు. విద్యా శాఖ మంత్రి సబిత, ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్ రెడ్డి, లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాగా, కేటీఆర్ తిమ్మాజీపేట పర్యటన సందర్భంగా బీజేపీ, బీఎస్పీ నాయకులను ముందస్తుగా అరెస్టులు చేశారు.

150 మెడికల్ కాలేజీలు ప్రారంభిస్తే ఒక్కటీ ఇయ్యలే

7 ఏండ్లలో కేంద్ర విద్యా సంస్థ ఒక్కటంటే ఒక్కటి కూడా తెలంగాణకు ఇవ్వలేదని, కేంద్ర వివక్ష ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవాలని కేటీఆర్ అన్నారు. కేంద్రం 150 మెడికల్ కాలేజీలు ప్రారంభిస్తే తెలంగాణకు ఒక్కటి ఇవ్వలేదని ఆరోపించారు. ఐఐఎంలను దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ప్రారంభించినా తెలంగాణకు మొండి చెయ్యి చూపించారన్నారు. పాలమూరు– రంగారెడ్డి పథకానికి జాతీయ హోదా ఇవ్వాలని అడిగితే పక్కనున్న కర్నాటక రాష్ట్రంలోని అప్పర్ భద్రకు ఇచ్చారన్నారు. తెలంగాణ విన్నపాలను పట్టించుకోలేదని ఆరోపించారు. రైల్వే లైన్లకు నిధులివ్వలేదని, రాయచూర్​–మాచర్ల లైన్‌‌ పెండింగ్‌‌లోనే ఉందన్నారు.