క‌రోనా నేప‌థ్యంలో పోలీసుల సేవ‌లు అమోఘం

క‌రోనా నేప‌థ్యంలో పోలీసుల సేవ‌లు అమోఘం

రాచకొండ: కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో ప్రాణాలకు తెగించి పోలీసులు చేస్తున్న సేవలు అమోఘమని మంత్రి తలసాని శ్రీనివాస్ అన్నారు. బుధ‌వారం రాచకొండ కమిషనరేట్ లో ఆయన పోలీసు అధికారులకు శానిటైజర్లు, మాస్కులు, హ్యాండ్​ గ్లౌజులు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ… కరోనా లాక్ డౌన్ నేపధ్యంలో పోలీసుల సేవలను, వారి పనితీరును కొనియాడారు. రాచకొండ కమీషనరేట్ పరిధిలో కమీషనర్ మహేష్ భగవత్ చేస్తున్న కృషిని ఆయన అభినందించారు. కమీషనరేట్ పరిధిలో సీపీ మహేష్ భగవత్.. నేరాల నిర్మూలనకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని, సీసీ కెమరాలు ఏర్పాటు చేశారని ఆయన అన్నారు. ఒకప్పుడు పోలీసులు అంటే ఒక రకమైన నెగిటివ్ అభిప్రాయం ఉండేదని, కానీ ఇప్పుడు పోలీసులు ప్రజలకు చేస్తున్న సేవను చూసి చాలామందికి మంచి అభిప్రాయం కలుగుతుందని తెలిపారు. ముఖ్యంగా ఇప్పుడు కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో ప్రాణాలకు తెగించి పోలీసులు చేస్తున్న సేవలు అమోఘమని అన్నారు.

ప్రభుత్వ పిలుపు మేరకు లాక్ డౌన్ సమయంలో పేదలు పస్తులు ఉండకూడదనే సంకల్పంతో ఎక్కడికక్కడ దాతలను సమీకరించి పేదలకు నిత్యావసరాలను అందిస్తున్నారని రాచకొండ కమీషనర్ మహేష్ భగవత్ ని అభినందించారు. ఈ కార్యక్రమంలో పోలీసులకు మంత్రి తలసాని 10 లక్షల రూపాయల విలువ చేసే శానిటైజర్లు, మాస్కులు, చేతి గ్లౌజులు అందజేశారు. ఈ కార్యక్రమంలో రాచకొండ సీపీ మహేష్ భగవత్, అడిషనల్ సీపీ సుధీర్ బాబు, మల్కాజిగిరి డీసీపీ రక్షితా మూర్తి, ఏడీసీపీ అడ్మిన్, డీసీపీ క్రైమ్స్, ఏసీపీలు తదితరులు పాల్గొన్నారు.

minister talasani srinivas praised rachakonda police service and their performance  locked down period