
- రఘునాథపాలెం మండలంలో మైనర్ బ్రిడ్జి, రోడ్డు పనులకు శంకుస్థాపన
ఖమ్మం టౌన్, వెలుగు : కొనసాగుతున్న అభివృద్ధి పనులను స్పీడప్ చేసి వర్షాకాలం లోపు పూర్తి చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. రఘునాథపాలెం మండలం కోటపాడులోని ఎస్సీ కాలనీలో సీఆర్ఆర్ నిధులు రూ.20 లక్షలతో చేపట్టిన అంతర్గత సీసీరోడ్లు, డ్రైన్ నిర్మాణ పనులకు, ఎఫ్డీఆర్ నిధులు రూ.99 లక్షలతో కోయచలక కమలాపురం రహదారిపై చేపట్టిన మైనర్ బ్రిడ్జి పున: నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కోటపాడు గ్రామంలో ఉంటున్న పేద ప్రజలకు మొదటి దశలో ఎంపిక చేసి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు. అంగన్వాడీ కేంద్రానికి కాంపౌండ్ వాల్, కమ్యూనిటీ హాల్ నిర్మాణం ప్రతిపాదనలు తయారు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, అడిషనల్ కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి, పీఆర్ ఎస్ఈ వెంకట్ రెడ్డి, రఘునాథపాలెం మండల తహసీల్దార్ శ్వేత, ఎంపీడీవో అశోక్ తదితరులు పాల్గొన్నారు.
బాధిత కుటుంబానికి పరామర్శ
కూసుమంచి : కూసుమంచి గ్రామానికి చెందిన బి.వెంకటవీరమ్మ ఇటీవల మృతి చెందగా శనివారం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆమె ఫొటోకు పూలమాలలు వేసి నివాళ్లులర్పించారు. మంత్రి వెంట కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎండీ హాఫీజుద్దీన్,సెట్రామ్నాయక్, అంజయ్య ఉన్నారు.