- 16వ డివిజన్ లో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన
ఖమ్మం టౌన్, వెలుగు : ఖమ్మం నగరంలో కొత్తగా ఏర్పాటు అవుతున్న కాలనీలు, విలీన గ్రామాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నట్టు రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అన్నారు. 16వ డివిజన్ శ్రీరామ్ నగర్ రోడ్డు నంబర్ 13లో టీయూఎఫ్ఐడీసీ నిధులు ఒక కోటి 95 లక్షలతో చేపట్టిన సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ఆయన ఆదివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఖాళీ స్థలాల్లో నీరు నిల్వకుండా యజమానులతో మాట్లాడాలని, స్పందించకుంటే నోటీసులు ఇవ్వాలని మున్సిపల్ కమిషనర్ కు సూచించారు.
వరదల కారణంగా ముంపు గురైన వారిలో ఇంకా కొందరికి పరిహారం అందలేదని దరఖాస్తులు వచ్చాయని, వాటిని పరిశీలించి అర్హులైతే పరిహారం అందజేస్తామని చెప్పారు. గత ప్రభుత్వం 10 ఏండ్లుగా అధికారంలో ఉండి రైతుల సంక్షేమాన్ని విస్మరించిందని, ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తూ ధర్నా చేయడం హాస్యాస్పదమన్నారు. దీపావళి నుంచి నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తున్నామని చెప్పారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామన్నారు.
మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య మాట్లాడుతూ రూ.2 కోట్లతో చేపడుతున్న రోడ్డు నిర్మాణానికి వర్క్ ఆర్డర్ అందించామని, రెండు రోజుల్లో పనులు ప్రారంభిస్తామని చెప్పారు. 16వ డివిజన్ లో దాదాపు 1,500 కుటుంబాలకు వరద పరిహారం అందించామన్నారు. పెండింగ్ లో ఉన్న మిగిలిన కుటుంబాలకు వారం రోజుల్లో అందిస్తామని చెప్పారు. జాబితాలో పేర్లు లేని కుటుంబాల కోసం సర్వే నిర్వహిస్తున్నామని, వరదల కారణంగా నష్టపోయిన ప్రతి కుటుంబానికీ సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు.
ఎగ్గొట్టిన రైతుబంధును మా ప్రభుత్వం చెల్లించింది
గత ప్రభుత్వం ఎగొట్టిన రూ.7,600 కోట్లు రైతు బంధును తమ ప్రభుత్వం చెల్లించిందని మంత్రి తుమ్మల అన్నారు. రైతు బంధు పేరు చెప్పి వ్యవసాయ యాంత్రీకరణ, పంటల బీమా, డ్రిఫ్ ఇరిగేషన్ పథకాలు అటకెక్కించారని ఆరోపించారు. సాగులో లేని భూములకు ఐదేండ్లలో రూ.25వేల కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని మండిపడ్డారు. వరి సాగుతో ఉరి అని, సన్నాలు సాగు చేయాలని, మొక్క జొన్న, పత్తి వద్దని రైతాంగాన్ని అయోమయం చేశారని గుర్తుచేశారు. గత ప్రభుత్వం పచ్చి రొట్ట విత్తనాలు సబ్సిడీ చెల్లించక చేతులెత్తేస్తే, కాంగ్రెస్ ప్రభుత్వమే బకాయిలు చెల్లించిందన్నారు.
ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్ట పోయిన రైతాంగాన్ని వారు అధికారంలో ఉన్నపుడు ఎందుకు పరామర్శించ లేదన్నారు. తెలంగాణ రైతాంగం బీఆర్ఎస్ పై విశ్వాసం లేకనే కాంగ్రెస్ ను గెలిపించారని తెలిపారు. రేవంత్ రెడ్డి పాలనలో మొదటి పంట కాలంలోనే రూ.27 వేల కోట్లు రైతుల సంక్షేమం కోసం ఖర్చు పెట్టామన్నారు. సన్న వడ్లకు రూ.500 బోనస్ అందిస్తున్నామని చెప్పారు. కానీ బీఆర్ఎస్ ధర్నాలు దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. రైతు సంక్షేమం కోసం బీఆర్ఎస్ రాజకీయాలు కాకుండా, నిర్మాణాత్మకమైన సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరారు.
వరంగల్ రైతు డిక్లరేషన్ వాగ్దానం అమలులో రాజీ పడేది లేదని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చేసిన సోనియమ్మ జన్మదినం డిసెంబర్ 9 నాటికి పూర్తి స్థాయిలో రైతు రుణమాఫీ చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వర రావు, ఆర్డీవో జి. గణేశ్, 16వ డివిజన్ కార్పొరేటర్ మేడారపు వేంకటేశ్వర్లు, నగర పాలక సంస్థ కార్పొరేటర్లు పాల్గొన్నారు.
నిశ్చితార్థం వేడుకకు హాజరు..
కూసుమంచి : కూసుమంచి మండలం పాలేరులోని బీవీ రెడ్డి ఫంక్షన్ హాల్ లో కాంగ్రేస్ నాయకుడు బోల్లంపల్లి సుధాకర్ రెడ్డి, రమాదేవి కుమార్తె నిశ్చితార్థం ఆదివారం జరిగింది. వేడుకకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు హాజరై ఆశీర్వదించారు.