కేరళ టీంతో మంత్రి తుమ్మల భేటీ

కేరళ టీంతో మంత్రి తుమ్మల భేటీ

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. శనివారం రాష్ట్రానికి వచ్చిన కేరళ వ్యవసాయ మంత్రి పి.ప్రసాద్‌‌‌‌‌‌‌‌, ఆయన మంత్రి బృందానికి తుమ్మల రాష్ట్ర వ్యవసాయ అభివృద్ధి గురించి వివరించారు. సెక్రటేరియెట్​లో వారు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రాష్ట్ర వ్యవసాయ అనుబంధ రంగాల్లో చేపడుతున్న  ప్రభుత్వ పథకాలను, సంస్కరణలను పీపీటీ ద్వారా ఆయన వివరించారు. ధాన్యం ఉత్పత్తిలో దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో ఉందని, పత్తి ఉత్పత్తిలో మూడో స్థానంలో నిలిచిందని మంత్రి చెప్పారు. రైతు భరోసా పేరుతో రైతులకు పెట్టుబడి సాయంతో పాటు బీమా సదుపాయం అమలు చేస్తున్నామని తెలిపారు.

ప్రత్యేక యాప్  ద్వారా ప్రతి పంటను నమోదు చేసి, రైతులకు ఉపయోగపడే  పంట వేసినప్పటి నుంచి చేతికి వచ్చే వరకు ఏఈవోలతో తనిఖీలు చేయిస్తున్నామని, పంట కొనుగోలుకి మార్కెటింగ్  సౌకర్యం కలిపిస్తున్నామని వెల్లడించారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత సాగు విస్తీర్ణం 1.31 కోట్ల ఎకరాలు కాగా ప్రస్తుతం ఇది 2.40 కోట్ల ఎకరాలకు 83% పెరిగిందన్నారు. మొత్తం ఆహార ధాన్యాల ఉత్పత్తి 2014-–15లో 94.90 లక్షల టన్నుల నుంచి 2022-–23లో 346.4 లక్షల టన్నులకు (265 %) పెరిగిందని వివరించారు. వరి విస్తీర్ణం 35 లక్షల ఎకరాల నుంచి 121.43 లక్షల ఎకరాలకు, ధాన్యం ఉత్పత్తి 68 లక్షల  టన్నుల నుంచి 258 లక్షల టన్నులు వరకు పెరిగిందన్నారు. సమావేశంలో కేరళ ప్రభుత్వ వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి అశోక్‌‌‌‌‌‌‌‌, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్‌‌‌‌‌‌‌‌రావు పాల్గొన్నారు.