సీతారామ ప్రాజెక్టుతో 10 లక్షల ఎకరాలకు గోదావరి జలాలు : మంత్రి తుమ్మల

సీతారామ ప్రాజెక్టుతో 10 లక్షల ఎకరాలకు గోదావరి జలాలు  : మంత్రి తుమ్మల
  • టన్నెల్​ పనులను పరిశీలించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
  • పనుల్లో వేగం పెంచాలని ఆదేశం

సత్తుపల్లి, వెలుగు : సీతారామ ప్రాజెక్టు పనులు పూర్తయితే ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 10 లక్షల ఎకరాలకు గోదావరి జలాలు అందుతాయని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. గురువారం సత్తుపల్లి, అశ్వరావుపేట ఎమ్మెల్యేలు డాక్టర్ మట్ట రాఘమయి దయానంద్, జారే ఆదినారాయణతో కలిసి యాతాలకుంటలో కొనసాగుతున్న సీతారామ ప్రాజెక్టు టన్నెల్ పనులను పరిశీలించారు. అనంతరం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ..

ఇప్పటివరకు ప్రాజెక్ట్ నిర్మాణానికి రూ.7 వేల కోట్లకు పైగా ఖర్చు జరిగిందన్నారు. సత్తుపల్లి, అశ్వరావుపేట నియోజకవర్గాల పరిధిలో నడుస్తున్న పనుల్లో యాతాలకుంట వద్ద నిర్మిస్తున్న టన్నెల్ ప్రధానమైనదన్నారు. టన్నెల్ పూర్తయితే బేతుపల్లి, లంకసాగర్ ప్రాజెక్టులకు నీళ్లు అందుతాయని చెప్పారు. రెండు వైపుల నుంచి చేస్తున్న పనుల్లో వేగం పెంచాలని అధికారులను ఆదేశించారు.

గండుగులపల్లిలో జరుగుతున్న 4వ పంప్ హౌస్ పనులను డెయిలీ పర్యవేక్షించాలన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేసే సీతారామ ప్రాజెక్టును పూర్తిచేయడం తన రాజకీయ కల అని చెప్పారు. ప్రభుత్వ నుంచి ఎలాంటి అనుమతులు కావాలన్నా తన దృష్టికి తీసుకురావాలని, ప్రాజెక్టు నిర్మాణానికి ఆటంకం కలగకుండా చూస్తానని స్పష్టం చేశారు.