
- సీడ్ కంపెనీల ప్రతినిధులకు మంత్రి తుమ్మల ఆదేశం
గద్వాల, వెలుగు: రైతులకు సీడ్ కంపెనీలు ఇవ్వాల్సిన డబ్బులు నెల రోజుల్లో చెల్లించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. సోమవారం సచివాలయంలో మంత్రి జూపల్లి కృష్ణారావు, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, రాష్ట్ర విత్తన అభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి, వ్యవసాయ శాఖ డైరెక్టర్ గోపితో కలిసి సీడ్ కంపెనీల ప్రతినిధులతో సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గద్వాల జిల్లా రైతులు 50 వేల ఎకరాల్లో సీడ్ పత్తి సాగు చేస్తున్నారని, నెలలు గడిచినా కంపెనీలు డబ్బులు చెల్లించకపోవడం సరైంది కాదన్నారు. గద్వాల జిల్లా రైతులు పత్తి విత్తనాల ఉత్పత్తిలో దేశంలోనే ముందు వరుసలో ఉన్నారన్నారు. విత్తనాలు ఉత్పత్తి చేసి కంపెనీలకు అందిస్తే, ఆయా కంపెనీలు రైతులకు డబ్బులు చెల్లించకపోవడం ఏమిటని నిలదీశారు. కంపెనీలు నెలరోజుల్లోగా బకాయిలు చెల్లించాలని ఆదేశించారు. రైతులకు రూ.700 కోట్ల వరకు బకాయి ఉన్నాయని, వాటిని వెంటనే చెల్లించాలన్నారు.