
- యూరియా కొరతపై బీఆర్ఎస్ కపటనాటకాలు: మంత్రి తుమ్మల
- పంట నష్టంపై త్వరలో నిర్ణయం ఉంటుందని వెల్లడి
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో యూరియా కొరతపై బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న ఆందోళనలను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఖండించారు. వ్యవసాయ కమిషనర్ ఆఫీసు వద్ద బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ధర్నాకు దిగడంపై మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం వల్ల యూరియా కొరత వచ్చిందని తెలిసి కూడా రాష్ట్ర సర్కారును బద్నాం చేయడం, సీఎం రేవంత్‌కు శాపనార్థాలు పెట్టడం వారి కపటనాటకాలకు నిదర్శనమన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి చర్చను పక్కదారి పట్టించేందుకే ఈ ఎత్తుగడలు వేశారని ఆరోపించారు.
పదేండ్ల బీఆర్‌ఎస్ పాలనలో రైతులను ఇబ్బందులు పెట్టిన వారు ఇప్పుడు మొసలి కన్నీళ్లు కారుస్తున్నారని విమర్శించారు. యూరియా కొరతకు కేంద్ర ప్రభుత్వం కారణమని కూడా తెలియదా? అని బీఆర్ఎస్ నేతలను ప్రశ్నించారు. అధికారం పోయిదనే అక్కసుతో కాంగ్రెస్ప్రభుత్వంపై దిగజారుడు రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. ఏప్రిల్ నుంచే బఫర్ స్టాక్స్ కోసం కేంద్ర మంత్రులను కలిసి విజ్ఞప్తి చేశామని, రూ.1,200 కోట్లు మార్క్‌ఫెడ్‌కు కేటాయించామని తెలిపారు. ఇటీవల కురిసన భారీ వర్షాలతో పంట నష్టం ప్రాథమిక వివరాలను సీఎంకు అందజేశామని, త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. రైతువారిగా పంట నష్ట సర్వేకు ఆదేశాలు ఇచ్చామని చెప్పారు.