సర్వనాశనం చేసింది నువ్వు కాదా: మంత్రి ఉత్తమ్

సర్వనాశనం చేసింది నువ్వు కాదా: మంత్రి ఉత్తమ్

వాస్తవాలను వక్రీకరించడం మాజీ సీఎం కేసీఆర్​కే చెల్లిందని.. సూర్యాపేట జిల్లాలో ఆదివారం ఆయన మాట్లాడిన ప్రతి మాట పచ్చి అబద్ధమని  ఇరిగేషన్​ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.  ‘‘ఇప్పటికే ఆయనకు అధికారం పోయింది.. త్వరలోనే బీఆర్​ఎస్​ పార్టీ కూడా అడ్రస్ లేకుండా పోతుందనే ఫ్రస్ట్రేషన్​లో కేసీఆర్ ఏదేదో మాట్లాడుతున్నడు.

ఓ వైపు కూతురు కవిత జైల్లో ఉంది. ఇంకో వైపు కాళేశ్వరం స్కామ్​, పశువుల కుంభకోణం, ఫోన్ ట్యాపింగ్.. ఇలా వరుస స్కామ్​లు కేసీఆర్ ను, ఆయన కుటుంబాన్ని వెంటాడుతున్నాయి. రానున్న రోజుల్లో ఇంకా ఏమైతదోనన్న భయం కేసీఆర్ లో ఉంది” అని విమర్శించారు.

ఎన్టీపీసీ ద్వారా 4 వేల మెగావాట్ల పవర్ ఉత్పత్తి చేస్తున్నట్లుగా కేసీఆర్ చెప్పారని, కానీ 16 వందల మెగావాట్ల విద్యుత్తు మాత్రమే ఉత్పత్తి అవుతుందని మంత్రి ఉత్తమ్​ తెలిపారు. ‘‘బీఆర్ఎస్  అధికారంలో ఉన్నప్పుడు ఎన్టీపీసీకి సహకరించి ఉంటే ఇప్పుడు 4 వేల మెగావాట్ల పవర్  మన చేతిలో ఉండేది. యాదాద్రి పవర్ ప్రాజెక్టుకు ఎక్కడ నష్టం వస్తుందోనన్న ఉద్దేశంతో  ఎన్టీపీసీకి కేసీఆర్ సహకరించలేదు. రాష్ట్ర చరిత్రలో ఇరిగేషన్, పవర్ సెక్టార్లను సర్వనాశనం చేసిన వ్యక్తి కేసీఆర్ మాత్రమే. స్వతంత్ర భారతదేశ చరిత్రలోనే ఈ రెండు సెక్టార్లను ఇంతగా నాశనం చేసిన వ్యక్తి మరొకరు లేరు” అని మండిపడ్డారు.

మిషన్ భగీరథను గత బీఆర్​ఎస్​ సర్కార్​ కమీషన్ భగీరథగా వాడుకుందని విమర్శించారు. కమీషన్​ భగీరథగా  మారంటే ప్రతి ఇంటికి నల్లా నీరు వచ్చేదని అన్నారు. ‘‘కాళేశ్వరం గురించి కేసీఆర్ మాట్లాడుడు చాలా వికారంగా ఉంది. కమీషన్ల కోసం కక్కుర్తి పడి కేసీఆర్​ కట్టిన ఈ ప్రాజెక్టు ఆయన హయాంలోనే కూలిపోవడం సిగ్గు చేటు. దీనికి ఆయన తలదించుకోవాలి. ఇదంతా మరిచిపోయి... ఇప్పుడు మామీద నిందలు వేస్తున్నడు” అని మంత్రి ఉత్తమ్​ ఫైర్​ అయ్యారు. కేఆర్ఎంబీకి  ప్రాజెక్టులను అప్పగించింది కేసీఆరేనని, ఇవ్వబోమని చెప్పింది తమ ప్రభుత్వం అని ఆయన అన్నారు. కృష్ణా నీళ్లను ఏపీ దోచుకున్నా నోరు మెదపని నేత కేసీఆర్ అని విమర్శించారు.