
హైదరాబాద్: కమిషన్ల కోసమే గత ప్రభుత్వం ప్రాజెక్టుల నిర్మాణం చేసిందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. ఇంకా ప్రాజెక్టులు పూర్తి కావడానికి లక్షాల 47 వేల కోట్లు కావాలన్నారు ఉత్తమ్. కాళేశ్వరంలో 25వేల కోట్లు పనులు ఎలాంటి డీపీఆర్ లు లేకుండా అలాట్ చేశారని అన్నారు. గత ప్రభుత్వంలో 94 వేల కోట్ల రూపాయలు కాళేశ్వరం కోసం ఖర్చు చేసి ఐదేళ్లలో 160 టీఎంసీల నీళ్లను మాత్రమే లిఫ్ట్ చేశారని చెప్పారు. ఇందులో ఇరిగేషన్ కోసం వినియోగించింది కేవలం 65 టీఎంసీలే అన్నారు. బీఆర్ ఎస్ తన తప్పును కప్పి పుచ్చుకునేందుకే జిమ్మిక్కులు చేస్తుందన్నారు. మేడిగడ్డపై నిజాలు చెప్పకుండా తప్పుడు ప్రచారం చేస్తుందన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి.
బీఆర్ ఎస్ నేతలు మేడిగడ్డలో పర్యటిస్తామంటున్నారు.. బీఆర్ ఎస్ అవినీతికి ప్రాజెక్టు ఎలా బలైందో చూసి రావాలని మేం స్వాగతిస్తున్నామన్నారు ఉత్తమ్. స్వతంత్ర భారతంతో ఇంత అవినీతి ఎప్పుడూ జరగలేదన్నారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల మూడు ప్రాజెక్టులు డ్యామేజ్ అయ్యాయని.. ఆ ప్రాజెక్టుల్లో నీటి నిల్వ సాధ్యం కాదని.. మేడిగడ్డ సాక్షిగా ప్రజలకు బీఆర్ ఎస్ నేతలు క్షమాపణలు చెప్పాలన్నారు.
మూడు ప్రాజెక్టులను డ్యామ్ సేఫ్టీ అధికారులకు అప్పగించాం.. వారి సూచనల మేరకు నడుచుకుంటాం.. ప్రాజెక్టులు పూర్తి కావాలంటే..లక్షా 47 వేల కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుందన్నారు నీటిపారు దల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.
ప్రాణహిత, చేవెళ్ల ప్రాజెక్టును నిర్లక్ష్యం చేసిందే బీఆర్ ఎస్ అని అన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ప్రాణహిత, చేవెళ్ల ప్రాజెక్టు పూర్తియితే కాంగ్రెస్ కు పేరు వస్తుందని వాళ్లు భయపడ్డారని చెప్పారు. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి ఇంజనీరింగ్ కమిటీనే రిపోర్డు ఇచ్చిందన్నారు. ఆ రిపోర్టును కేసీఆర్ లెక్క చేయలేదని.. ఉల్టా మాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు.