
- మహిళల జీవితాల్లో వెలుగులు నింపడమే ప్రభుత్వ లక్ష్యం
- ప్రజల జీవన ప్రమాణాలు పెంపొందించేందుకు కృషి
హుజూర్ నగర్/తుంగతుర్తి, వెలుగు : కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాల్లో అందరూ భాగస్వాములు కావాలని నీటిపారుదల, పౌర సరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. హుజుర్నగర్ నియోజకవర్గ పరిధిలోని 231 మంది లబ్ధిదారులకు మంజూరైన రూ.2.30 కోట్ల విలువైన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం తిరుమలగిరి మండలం తాటిపాముల గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరావుతో కలిసి శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ మహిళల జీవితాల్లో వెలుగులు నింపడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.
మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు వడ్డీలేని రుణాలు అందజేసినట్లు తెలిపారు. ప్రభుత్వ రుణాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ప్రజల జీవన ప్రమాణాలు పెంపొందించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. హుజుర్నగర్ లో రూ.7.50 కోట్లతో జూనియర్ కళాశాల, రూ.4.50 కోట్లతో డిగ్రీ కళాశాల భవనాలను నిర్మిస్తామన్నారు. హుజూర్నగర్ పట్టణంలోని రామస్వామిగుట్ట వద్ద నిర్మించిన 2,000 ఇండ్లను అర్హులైన లబ్ధిదారులకు కేటాయించాలని అధికారులను ఆదేశించారు. లబ్ధిదారులు మొత్తం హుజుర్నగగర్ పట్టణంతోపాటు మండలానికి చెందినవారై ఉండాలని సూచించారు. మిగిలిన మండలాల్లో ఇండ్లు లేని నిరుపేదలకు రూ.5 లక్షలు అందించే ప్రక్రియ త్వరలోనే ప్రారంభమవుతుందని ప్రకటించారు.
తాటిపాముల గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతా..
తనకు జన్మనిచ్చిన తాటిపాముల గ్రామాన్ని అభివృద్ధిలో ఆదర్శంగా తీర్చిదిద్దుతానని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. రైతుల సంక్షేమం కోసం యశ్వంత్‌పుర వాగుపై రూ.20 కోట్లతో చెక్ డ్యామ్ నిర్మిస్తామన్నారు. రూ.కోటితో రెండు వరుసల వంతెనను నిర్మిస్తామని చెప్పారు. తాటిపాముల గ్రామంలో రూ.2 కోట్లతో డ్రైనేజీ, సీసీ రోడ్లు నిర్మిస్తానని పేర్కొన్నారు. చెన్నూరు రిజర్వాయర్ నుంచి తాటిపాముల మీదుగా తిరుమలగిరికి సాగునీరు తరలిస్తామని వెల్లడించారు.
ధాన్యం దిగుబడిలో ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రథమ స్థానం..
దేశంలోనే వరి సాగులో తెలంగాణ మొదటి స్థానంలో ఉందని, తెలంగాణలో ఉమ్మడి నల్గొండ జిల్లా ధాన్యం దిగుబడిలో ప్రథమ స్థానంలో నిలిచ్చిందని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. వానాకాలంలో 151 లక్షల మెట్రిక్ టన్నులు, యాసంగిలో 127 లక్షల మెట్రిక్ టన్నులు పండించడంతో ప్రతి ఊరు ధాన్యం రాశులతో కళకళలాడుతోందన్నారు. త్వరలో ఎస్ఎల్బీసీ పూర్తి చేసి ఉమ్మడి జిల్లాను సస్యశ్యామలం చేస్తామని తెలిపారు.
కార్యక్రమంలో భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కుంభం అనిల్ కుమార్ రెడ్డి, అగ్రికల్చర్ కమిషన్ మెంబర్ చెవిటి వెంకన్నయాదవ్, ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సుధీర్ రెడ్డి, ఎస్పీ నరసింహ, అడిషనల్ కలెక్టర్ రాంబాబు, ఇరిగేషన్ ఎస్ఈ రమేశ్ బాబు, ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.